Telugu States

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన రేవంత్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలంలో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేయడం.. వివాదాస్పదం అయింది. అద్దంకి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని రేవంత్ అన్నారు. అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ క్షమాపణ చెప్పారు. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డిది కీలక పాత్ర అని ఆయనంటే మాకు గౌరవం ఉందని రేవంత్ అన్నారు. ‘ఈ మధ్య పత్రికా సమావేశంలో హోం గార్డ్ ప్రస్తావన, చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. వెంకట్ రెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడటంతో ఆయన ఎంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా క్షమాపణ చెప్పాలని ఆయన నన్ను డిమాండ్ చేశారు. కాబట్టి ఆయనకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా.. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీల పోషించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని ఇలా అవమానించేలా ఎవరూ మాట్లాడటం సరికాదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేశాము’ అని రేవంత్ వీడియోలో పేర్కొన్నారు.

అయితే అద్దంకి దయాకర్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే.. రేవంత్ రెడ్డి సారీపై స్పందిస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. దయాకర్‌ను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేస్తేనే.. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటానని కోమటిరెడ్డి తేల్చిచెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Related Articles

Back to top button