Telugu States

ఐదు నెలలుగా అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నానన్న రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి గురించి పలు పార్టీల నేతలు ఇటీవలి కాలంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ అవినీతిని బయటపెడుతానంటూ చెబుతున్నారు. తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అతిపెద్ద అవినీతిపరుడని.. వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం తాము గత ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. ఆయన అపాయింట్ మెంట్ ఇస్తే కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని కొల్లగొట్టారని.. కమిషన్ల కోసమే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లను దోచుకున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించే దమ్ము కేసీఆర్ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ డైరెక్షన్‌లో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీని తిట్టినట్టు చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, మోదీ– కేంద్రహోంమంత్రి అమిత్‌షాల బంధం గట్టిదని.. అందుకే కేసీఆర్‌ తన ప్రెస్‌మీట్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తిడుతున్నారేకానీ ఆ పార్టీని ఏమీ అనడంలేదని అన్నారు. దేశంలో అత్యంత కీలకమైన వ్యక్తుల మీద కేసులు పెట్టిన ఢిల్లీ పెద్దలు కేసీఆర్‌ కుటుంబాన్ని మాత్రం టచ్‌ చేయలేదన్నారు. బండి సంజయ్‌ను సవాల్‌ చేసిన కేసీఆర్‌కు మోదీని సవాల్‌ చేసే దమ్ముందా అని రేవంత్‌ ప్రశ్నించారు.

బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని.. సీఎం కేసీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రెస్‌మీట్లు కల్లు కాంపౌండ్‌ గొడవలను తలపిస్తున్నాయని విమర్శించారు. సంజయ్‌పై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై చర్చ జరగకుండా ఉండేందుకు ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయని ఆరోపించారు. నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్‌ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. ఆయన అవినీతిని బయటపెట్టే ధైర్యం తనకుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.దమ్ముంటే సీబీఐ విచారణ వేయించండని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. కేసీఆర్‌ అవినీతిని తాను నిరూపిస్తానని చెప్పారు. అలా నిరూపించకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Related Articles

Back to top button