దేశంలో మరోసారి కరోనా కేసుల టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలను మొదలు పెట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ రేటు 0.50 శాతం దాటడంతో ఇక్కడ లెవల్ 1 ఆంక్షలను (ఎల్లో అలర్ట్) అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో బహిరంగ సమావేశాలు, సభలను నిషేధించడంతో పాటు రాత్రుళ్లు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. థియేటర్లు, పబ్ లు, జిమ్ లని మూసివేయించారు. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో లెవల్-2 ఆంక్షలను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో చేస్తున్న మొత్తం పరీక్షల్లో పాజిటివ్ కేసుల రేటు 1.29 శాతానికి చేరింది. మంగళవారం కూడా పాజిటివ్ రేటు ఒక శాతంపైనే నమోదైంది. అయితే కేసులు పెరుగుతున్న స్థాయిలో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువే. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగానే ఉన్నందున మరికొన్ని రోజుల పాటు ఎల్లో అలర్ట్ నే కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ముఖ్యంగా ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికీ ఒమిక్రాన్ సోకుతోంది. దీంతో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) మొదలైపోయినట్టేనని ఢిల్లీ మత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. ఒమిక్రాన్ క్రమంగా జనాల్లోకి వెళ్లిపోయి వ్యాప్తి మొదలైపోతోందని భావిస్తున్నారు. ఢిల్లీలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్ కేసులేనని అన్నారు. తాజా జన్యు క్రమ విశ్లేషణలో ఈ విషయం తేలింది.
ముంబై నగరంలో అధికారులు 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. పండుగ సీజన్, నూతన సంవత్సర వేడుకల సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఈ నెల ప్రారంభంలో ముంబైలో సెక్షన్ 144 విధించింది. ఇప్పుడు 144 సెక్షన్ ను జనవరి 7, 2022 వరకు పొడిగించబడింది. డిసెంబర్ 30 నుండి జనవరి 7, 2022 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లు, క్లబ్‌లతో సహా, బహిరంగ ప్రదేశంలో కొత్త సంవత్సర వేడుకలు, పార్టీలను నగర పోలీసులు నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.