తాలిబాన్లు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆఫ్ఘన్ దళాలు ప్రతిఘటిస్తూ ఉన్నాయి. తాజాగా ఆఫ్ఘన్ దళాలు తాలిబాన్ నియంత్రణ నుండి మూడు జిల్లాలను విముక్తి చేశారని రిపబ్లిక్ లో కథనాలు వచ్చాయి. బాగ్లాన్ ప్రావిన్స్‌లోని పోల్-ఇ-హసర్, దేహ్ సలాహ్ మరియు బాను జిల్లాలను తాలిబాన్ వ్యతిరేక శక్తులు స్వాధీనం చేసుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారిపోయినా ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ మాత్రం తాలిబాన్లపై తన పోరాటం ఉంటుందని వెల్లడించాడు. ఆప్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలో తిరుగుబాటు మొదలైంది. తాలిబన్లపై తిరుగుబాటు చేస్తోన్న ఆప్ఘన్ సైన్యం ఇప్పటికే చారికర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. పంజ్‌షీర్ ప్రాంతంలోని తాలిబన్లపై కూడా ఆప్ఘన్ సైన్యం తిరుగుబాటును కొనసాగిస్తోంది. ఇప్పటికీ తాను తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదన్న వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ తనకు మద్దతు ఇవ్వాలని నేతలను కోరుతున్నారు. తాలిబన్ల అధీనంలోకి రాని పంజ్‌షేర్ ప్రావిన్సులో అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ‘నార్తర్న్ కూటమి’ పేరిట తాలిబన్లపై సాయుధ పోరాటానికి ఆయన నాయకత్వంలో ఇక్కడ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా సలేహ్ ప్రకటించుకున్నారు.
ఆఫ్ఘన్ ప్రభుత్వానికి విధేయులైన మిగిలిన దళాలు అమ్రులల్లా సలేహ్ కు మద్దతుగా ఉన్నాయి. మార్షల్ అబ్దుల్ రషీద్ దోస్తుమ్ మరియు అట్టా మహ్మద్ నూర్ అత నూర్ నాయకత్వంలో సలేహ్‌కు విధేయులైన బలగాలతో పూర్తి పంజ్‌షీర్ ప్రాంతాన్ని తాలిబాన్ల చేతుల్లో నుండి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. తాలిబాన్ నియంత్రణలో లేని ఏకైక ప్రావిన్స్ అయిన పంజ్‌షీర్ నుండి తాలిబాన్లపై ప్రతిఘటన జెండా ఎగురుతోంది. దివంగత ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసౌద్ నేతృత్వంలోని రెజిస్టెన్స్ ఫోర్స్ పోరాడుతోంది. అహ్మద్ షా మసౌద్ ను పంజ్‌షీర్ యొక్క “సింహం” గా పిలుస్తారు. ఆయన స్ఫూర్తితో కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పంజ్‌షీర్ లోయలో బలం పుంజుకుంటోంది. తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తులను ఒకే చోటకు తీసుకుని వస్తున్నారు.
తాలిబాన్లకు ప్రజల నుండి కూడా ధిక్కార స్వరం ఎదురవుతోంది. ఆఫ్ఘన్ స్వాతంత్య్ర దినోత్సవమైన గురువారం నాడు పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తాలిబాన్ జెండాలను దించేసి, ఆఫ్ఘన్ జాతీయ పతాకాన్ని ధైర్యంగా ఎగరేసి ప్రజాస్వామ్య కాంక్షను చాటిచెప్పారు. ఊహించని విధంగా ఎదురవుతున్న వ్యతిరేకతతో తాలిబన్లు అమాయకులపై తుపాకీని గురిపెడుతూ ఉన్నారు. ప్రజా ఉద్యమాన్ని ఆదిలోనే అణచివేసే ప్రయత్నాల్లో భాగంగా హింసకు పాల్పడుతున్నారు. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడగా, అసదాబాద్ నగరంలో కొందరు మృతిచెందారు.