హోం గార్డుల నియామకాల్లో రిజర్వేషన్లను తీసుకొస్తాం: సీఎం జగన్

0
789

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు శాఖలో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. పోలీసు శాఖలో భారీ ఎత్తున నియామకాలను చేపట్టబోతున్నామని.. 6,511 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలోనే పోలీసు శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని.. పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. హోం గార్డుల నియామకాల్లో రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మాట్లాడుతూ.. అమరవీరులకు, త్యాగధనులైన పోలీసు కుటుంబాలను శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. గత సంవత్సర కాలంలో 11 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని.. సమాజం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థలో పలు సంస్కరణలను తీసుకొచ్చామని.. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఇందులో భాగమేనని తెలిపారు. పోలీస్ శాఖలో 16 వేల మంది మహిళా పోలీసులను నియమించామని.. దళిత మహిళను హోం మంత్రిగా నియమించామని చెప్పారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలనేది తన ఉద్దేశమని… అయితే, సిబ్బంది కొరత వల్ల అది అమలు కావడం లేదని జగన్ తెలిపారు. పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టి.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.