More

    బండి దండయాత్ర.. కేసీఆర్‎కు సవాల్..?

    ముగ్గురు నేతలు, మూడు భిన్న స్థలకాలాల్లో చేసిన మూడు పాదయాత్రలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురు భిన్న ధృవాల భావజాలాలను నమ్మినవారు. ముగ్గురి అహర్యం కూడా విభిన్నమైంది. ఆ ముగ్గురిలో 1951లో తెలంగాణ గ్రామాలను సందర్శించి ప్రజల బాగోగులు తెలుసుకున్న గాంధేయవాది ‘వినోబా భావే’, 2003లో భోరోసా యాత్రతో అధికార పీఠాన్ని అధీష్ఠించిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, తాజాగా బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’. ఈ యాత్రల ఉద్దేశాలు కూడా అంతే భిన్నం.

    తెలంగాణలో 1951లో అలుముకున్న కల్లోల పరిస్థితులు, రాజాకార్ అకృత్యాలు, రైతాంగ సాయుధ పోరాటం పేరుతో కమ్యూనిస్టులు చేసిన ఉద్యమం, నాటి యూనియన్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో…ఫలితంగా తెలంగాణ పచ్చి పుండుగా ఉంది.

    దక్షిణాదిలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగడం వాతావరణాన్ని మరింత హింసవైపు తీసుకెళుతుందని గుర్తించారు వినోబా భావే. ఒక రాజీ భానన ఉంటుందన్న ఎరుక కలుగ జేయాలని ‘భూదాన ఉద్యమం’ చేపట్టారు. 1951 మార్చి8న నల్లగొండ జిల్లా పోచంపల్లిలో మొదలైన ‘సర్వోదయ యాత్ర’  ఏప్రిల్ 7న ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లిలో ముగిసింది. వినోబా భావే నెలరోజులపాటు సుమారు 5వందల కీలోమీటర్ల పాదయాత్ర చేశారు. జైన, బౌద్ధ ధర్మాల్లోని నిరాడంబర భావనకు చిహ్నంగా, ఊతకర్ర పట్టుకుని, కొల్లాయి కట్టుకుని తిరిగారు.

    జాగీర్లు, సంస్థానాల్లోని భూ స్వాములు స్వచ్చందంగా, తమ ఇచ్ఛఉన్నంత భూమిని ప్రజలపరం చేయాలన్నది వినోబా భావే ఆశయం. నిజానికి ఆనాటికి ‘భూదాన’ పద్ధతి పోయింది. భూదాన, గోదాన, సువర్ణ దానాలకు హిందూ ధర్మంలోని పవిత్రత కారణంగా రాచరికపు రోజుల్లో ఆలయాలకు, తమ సేవకులకు భూములు పంచేవారు రాజులు.

    వినోబా భావే ఆశించిన ‘భూస్వామ్య దాతృత్వం’ ఎంతో కొంత ఫలించింది. కొంతమంది పేదలకు సాగుభూమి అందింది. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత చాలా భూములు తిరిగి దాతల చేతుల్లోకి వెళ్లాయి.

    ఈ ప్రత్యేక కారణాల రీత్యా ఎన్ని పరిమితులున్నా ‘వినోబా భావే’  సర్వోదయ యాత్ర చారిత్రక ప్రాముఖ్యతను విస్మరించకూడదు. చరిత్రలో కనిపించే జటిల సమస్యలను ఆనాటి కాలపరిమితిని మీరి ఇప్పుడు ధర్మనిర్ణయం చేయలేం!

    వినోబా భావే సర్వోదయ యాత్ర తర్వాత అర్ధ శతాబ్దానికి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 2003 మండువేసవిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలుపెట్టి 1460 కిలోమీటర్లు సాగింది. పాదయాత్ర నాటికి ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో తన గంభీరమైన ఉపన్యాసాలతో, అధికార పక్షాన్ని ఎగతాళి చేస్తూ ప్రజాదరణ పొందారు. వైఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు, అధికారంలోకి వచ్చాక కూడా అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగేవి. జనం ఆసక్తిగా చూసేవారు.

    స్వపక్షం, అధికార పక్షం, వ్యాపార వర్గాల్లోనూ వై.ఎస్.పై వ్యతిరేకత ఆనాటికే మితిమీరి పేరుకుని ఉంది. వైరిపక్షాల ఎత్తులను చిత్తు చేయడానికి పాదయాత్రను వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు వైఎస్. దీనికి తోడు పాలనా వైఫల్యాలు, సాగునీటి కరువు, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏళ్లతరబడి అలసత్వాన్ని ఎండగట్టడంలో పూర్తి విజయం సాధించారు. వీటన్నింటినీ మించి విదర్బ మొదలు తెలంగాణ వరకు లెక్కలేనన్ని రైతుల ఆత్మహత్యల విషయంలో దేశ వ్యాప్త నిరసన క్రమంగా పెరిగింది.

    వైఎస్ తన వాదనా పటిమను, అధ్యయనాన్ని, పరిశీలనను, గణాంకాలను కలిపి భాషా పాటవం కలగలిసిన ఘాటు ఉపన్యాసాల కారణంగా ప్రజాదరణ కాస్త ఎనలేని అభిమానంగా తర్జుమా అయింది. కష్టంలో ఉన్నవారికి ఆశ కల్పిస్తే ఎవరి కీర్తి అయినా ఆకాశమంత పెరగడం సహజం.  

    తొలిదశలో మీడియా వై.ఎస్ పట్ల వ్యతిరేకతనే శక్తిమేరకు కనపరిచింది. యాత్రకు అపారమైన ఆదరణ లభించడంతో ప్రచురించక, ప్రసారం చేయక తప్పని స్థితి ఏర్పడింది. అయితే వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చలేదు. ఆనాడు కూడా సంక్షేమం పేరుతో డబ్బు పంపకమే జరిగింది. వైఎస్సార్ ఉండి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో తెలియదు….కానీ, వైఎస్సార్ దుర్మరణం, ఆయన కీర్తి ప్రతిష్ఠలకు చరిత్రలో సుస్థిర స్థానం కలిగేందుకు దోహదపడింది.

    వినోబా భావే నాటికి పేదరైతులకు భూమి కావాలన్న ప్రాణావసరం, యాభై ఏళ్ల తర్వాత వైఎస్ పాదయాత్ర సమయానికి సాగుసమస్యలతో రైతన్నలు ఆత్మహత్యను ఆశ్రయించడమనే పరిణామం వ్యవసాయరంగ చరిత్రలో విషాదం.

    బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నాటికి రకరకాల కారణాలతో స్వరాష్ట్రంలో ప్రజల భూములను దౌర్జన్యంగా లాక్కునే ప్రభుత్వం అధికారంలో ఉంది. పాదయాత్ర ఎవరు చేసినా భూమి, అన్నదాత చుట్టే ఎజెండాగా ఉంది.

    అబద్ధం, అవినీతి, అశ్రితపక్షపాతం ఈ మూడు మంత్ర పుష్పాలను అధికారపార్టీ బాహటంగానే జపిస్తోంది. చాటుమాటుగా కాదు బలాదూర్ గానే ప్రజాధనాన్ని లూటీ చేయవచ్చని నిరూపిస్తోంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇవాళ తెలంగాణ పరిస్థితి అత్యంత దారుణంగా, దయనీయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ ‘మహా సంగ్రామ యాత్ర’కు నడుం బిగించడం సరికొత్త రాజకీయ సమీకరణకు కారణం కాగలదు.

    తెలంగాణ ఉధ్యమంలో భాగం పంచుకున్న బీజేపీ, ఆవిర్భావంలోనూ పార్లమెంట్ వేదికగా తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిజాం నిరంకుశత్వాన్ని తలపిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు అత్యంత పీలగా ఉండటం అధికార పార్టీకి మరింత అలుసుగా మారింది.

    ఈ నేపథ్యంలో ఘాటుగా, దీటుగా, ధైర్యంగా ప్రశ్నించే నిజాయితీగల నేతల అవసరం ఉంది. ఈ అవసరాన్ని బండి సంజయ్ పూడ్చే అవకాశాలను తిరస్కరించలేం. మొదటి కన్నా మిన్నగా బీజేపీ నేడు తన శ్రేణులను ఎన్నికల యుద్ధంలో మోహరిస్తోంది. ఫలితాలను సాధిస్తోంది.

    వైఎస్సార్ తో పోల్చగల అనుభవం లేకపోవచ్చు. అయితే నిజాయితీ, ఇచ్చినమాట నిలబెట్టుకునే స్వభావం, శ్రమించే తత్వం గల నేతలను ప్రజలు తప్పక ఆదరిస్తారు. అయితే దొంగ ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. విమర్శను సంధిస్తున్నపుడు వైరి పక్షం ప్రతివిమర్శకు దిగేందుకు భయపడేంత పటిష్ఠమైన, వివరాలతో కూడిన విమర్శలు చేయడం అవసరం. ఆ పని బీజేపీ చేయగలదు. అందుకు తగిన వనరులూ, మేధావులూ ఆ పార్టీలో చాలా మందే ఉన్నారు.

    బండి సంజయ్ తెలంగాణ రాజకీయ మైదానంలో దిగిన తర్వాత సమష్టి కృషితో చెప్పుకోదగిన విజయాలను నమోదు చేశారు. కేసీఆర్ లాంటి నోటి దురుసుగల నేతను ఎదుర్కోవడానికి గుండెబలం కావాలి. దండును కూడగట్టాలి. సమర శంఖం పూరించాలి. అందుకు ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తప్పక దోహదం చేయగలదు.

    ప్రతి పాదయాత్రలోనూ రూపుగట్టే  జనాశీర్వాదాన్ని ఓటురూపంలోకి తర్జూమా చేసుకునే వ్యూహం అవసరం. వైఎస్సార్ పాదయాత్ర సమయంలో నడకలోనూ, విశ్రాంతిలోనూ, జనాన్ని పలకరించినపుడూ.. ప్రతిసందర్భాన్ని ప్రచారానికి వాడుకున్నారు. వైరిపక్షాలు ప్రస్తుతించక తప్పని స్థితి కల్పించారు. ప్రత్యేక నినాదాలు, ప్రజల గుండెను హత్తుకునే భాష, పాదయాత్ర తర్వాత కన్సాలిడేషన్ ఈ మూడు…. పాదయాత్ర ప్రయోజనాన్ని మరింత పెంచుతాయి. తెలంగాణలో పాదయాత్రల వార్తలు పత్రికల్లో క్రిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర, షర్మిల వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలుపెట్టాలనుకుంటున్న పాదయాత్ర,ల భవితవ్యం ఏం కానుందో వేచిచూడాలి.  ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరంభించిన ప్రజా సంగ్రామ యాత్ర… తెలంగాణ రాజకీయ మైదానంలో ప్రకంపనలు సృష్టిస్తున్న యాత్ర.  ఈ ప్రకంపనలు ఏ స్థాయికి చేరతాయన్న దాన్ని బట్టే అంతిమ ఫలితం ఆధారపడి  ఉంటుంది.

    Related Stories