National

ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని తొలగించండి..!

భారత్ లో సెకండ్ వేవ్ కు కారణం ‘ఇండియన్ వేరియంట్’ అంటూ కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని మరీ ప్రచారం చేశాయి. ‘ఇండియన్ వేరియంట్’ ఇతర దేశాల్లోకి ప్రవేశించిందంటూ కొన్ని సంస్థలు కూడా విష ప్రచారాన్ని చేశాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడా కూడా ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని ఉపయోగించలేదు. కానీ కొందరు మాత్రం పని గట్టుకుని భారత్ లో కొత్త కరోనా వేరియంట్ పుట్టిందని ప్రచారాన్ని చేశారు.

సోషల్ మీడియాలో ఇండియన్ వేరియంట్ అంటూ ఉన్న కథనాలను వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందుకు సంబంధించి ఐటీ మినిస్ట్రీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇండియన్ వేరియంట్ అంటూ కంటెంట్‌తో కూడిన కథనాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాల్సిందిగా సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం నాడు ఓ లెటర్ ను ఐటీ మినిస్ట్రీ జారీ చేసింది. B.1.617 కారణంగా కరోనా కేసులు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు కానీ.. ‘ఇండియన్ వేరియంట్’ ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని కేంద్రం వెల్లడించింది. కరోనా B.1.617 వేరియంట్‌ను ‘ఇండియన్ వేరియంట్’ అని డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా చెప్పలేదని,ఏ రిపోర్టులోనూ పేర్కొనలేదని తెలిపింది. ఇదివరకే మే 12న దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టతనిచ్చింది.

ఇండియన్ వేరియంట్ అంటూ ఉన్న కథనాలన్నిటినీ ‘వెంటనే తొలగించాలని’ కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలకు శుక్రవారం సూచించింది. సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఇండియన్ వేరియంట్ అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇండియన్ వేరియంట్ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడూ చెప్పలేదు. కేవలం B.1.617 అంటూ మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల్లో ఉంది’ అని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా సంస్థలకు ప్రభుత్వం సూటిగా చెబుతోంది ఒక్కటేనని.. ఇండియన్ వేరియంట్ అన్నది లేదు.. ఆ పదాన్ని ఉపయోగించి ఉన్న సోషల్ మీడియా కథనాలను అన్ని సోషల్ మీడియా సంస్థలు తొలగించాల్సిందే..! భారతదేశం ఇమేజ్ కు నష్టం కలిగించాలని కొందరు కావాలనే ప్రచారం చేశారు అని మరో సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు.

ఈ పదాన్ని ఉపయోగించిన మొత్తం కంటెంట్ ను తీసివేయాలంటే కాస్త కష్టమేనని ఓ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వందలు, వేలల్లో ఈ పదాలను ఉపయోగించిన కంటెంట్ ఉంటుందని.. వాటన్నిటినీ తొలగించాలంటే మాత్రం కీవర్డ్ సెన్సార్ షిప్ ను తీసుకుని రావాల్సి ఉంటుందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 1 =

Back to top button