మతమార్పిడుల వెనుక.. కార్పొరేట్ ఉన్మాదం..!

0
873

“For great men, religion is a way of making friends; small people make religion a fighting tool.” అంటారు ఏపీజే అబ్దుల్ కలాం. గొప్ప వ్యక్తులు మతాన్ని స్నేహితులను సంపాదించే సాధనంగా ఉపయోగిస్తే.. కిందిస్థాయి వ్యక్తులు మతాన్ని కేవలం కొట్లాండేందుకు సాధనంగా ఉపయోగిస్తారన్నది ఆయన అభిమతం. అందుకే మతాన్ని ఎల్లప్పుడూ సమాజాన్ని కలిపేదిగా ఉండాలే తప్ప, విడదీసేందుకు కానీ, అవతలి మతాలపై దాడులకు దిగేందుకు కానీ ఉపయోగించకూడదు. భారత దేశంలో వేల ఏళ్ళనుంచీ వెలుగునిచ్చిన సనాతన ధర్మం ప్రజలందరినీ కలుపుతూ వచ్చింది. ప్రజలు సుఖసంతోషాలతో ఆనంద జీవనం గడిపేలా సనాతన ధర్మం ఒక సాధనంగా ఉపయోగపడింది. సనాతన ధర్మంలో వందల కొద్దీ ఉపశాఖలున్నా, భిన్నమైన ఆచారాలున్నా అందరినీ కలిపి ఉంచగలిగింది. పేద ధనిక వర్గాలనే తేడా లేకుండా అందరినీ ఒకే గొడుగుకింద కాపాడుకొచ్చింది. కాలక్రమంలో భారత దేశంలో అనేక చిన్న చిన్న మతాలు కూడా పుట్టుకొచ్చాయి. సిక్కు, జైన, బౌద్దం లాంటి మతాలు ఎన్ని పుట్టుకొచ్చినా సనాతన సాగరం ఈ మతాలను కూడా తనలో రత్నాలవలె కలిపేసుకుంది. ఇదంతా హిందూ ధర్మం లోని ఇన్‎క్లూజివ్‎నెస్ అనే భావనతోనే సాధ్యమైంది. ఈ విధంగా వేల ఏళ్ళు సనాతన ధర్మం వెలుగొందింది. అయితే దీనిపై మెల్లిమెల్లిగా ఇతర మతాల నుంచి దాడులు మొదలయ్యాయి. ముఖ్యంగా మధ్యప్రాశ్చ్య దేశాల్లోని అబ్రహామిక్ మతాలనుంచి సనాతన ధర్మం భారీగా దాడులను ఎదుర్కొంది.

భారత్ పై ఇస్లామిక్ పాలకులు దండయాత్రల నుంచి మతమార్పిడులు ఎక్కువయ్యాయి. ఇస్లామిక్ రాజుల పాలనలో హిందువులు బలవంతపు మతమార్పిడులకు గురయ్యారు. మతం మారని వారు భారీగా చంపబడ్డ దాఖలాలు చరిత్రలో పుంఖాను పుంఖాలుగా కనిపిస్తాయి. పేదలపై బలవంతపు జిజియా పన్నులు కూడా విధించబడ్డాయి. దీంతో ఆ పన్నులు తట్టుకోలేని నిరుపేదలు కొందరు మతమార్పిడికి ఒప్పుకుంటే చాలా మందిని బలవంతంగా మతమార్పిడులు చేశారు. ఎన్నో హిందూ దేవాలయాలు నాశనం చేయబడ్డాయి. అప్పటినుంచి సనాతన ధర్మం విధ్వంసం మొదలైంది. సంస్కృతి సంప్రదాయాలపై తీవ్ర ఆంక్షలు విధించి మానసికంగా వేధించారు. అయోధ్య, కాశీ, మధుర లతో పాటు దాదాపు ముప్ఫై వేల దేవాలయాలపై దాడులు చేసి హిందూ దేవతల విగ్రహాలను కూల్చి వాటి శిథిలాలపై మసీదులు కట్టారు. కేవలం దేవాలయాలను ధ్వంసం చేయడానికే యుద్దాలను చేశారు నాటి మొఘల్ పాలకులు. కాశీ విశ్వనాథ దేవాలయంపై దాడిచేయడానికి ఔరంగజేబు ప్రయత్నించినప్పుడు 1664లో నాగసాధువులు కూడా ఓడించి తరిమివేశారు అయినా మరో ప్రయత్నంలో ముఘలులు విజయం సాధించి కాశీ విశ్వనాథ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ విధంగా రాజ్యాల కోసం కాకుండా కేవలం దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరిపిన సందర్భాలు కూడా చరిత్రలో నిక్షిప్తమయ్యాయి.

అయితే భారత్ లో పోర్చుగీసు పాలన మొదలయ్యాక క్రైస్తవ మతమార్పిడులు కూడా మొదలయ్యాయి. పోర్చుగీస్ ప్రభుత్వం గోవాలో ఉండటంతో క్రైస్తవ మతమార్పిడులను మొట్టమొదటిసారిగా ఎదుర్కొంది. ప్రపంచంలోనే అతి దారుణమైన ఇంక్విజిషన్ చట్టాలను గోవా చవిచూసింది. హిందువులు దారుణ శిక్షలను అనుభవించాల్సి వచ్చింది. తల్లిదండ్రులముందే పిల్లలను చంపడం, వారి చేతులు కాళ్ళూ విరిచి అవిటివారిని చేయడం లాంటి ఎన్నో ఆకృత్యాలకు పాల్పడ్డారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గోవా ప్రజలు క్రైస్తవ మతం పుచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత బ్రిటిష్ పాలకులు కూడా ఇటువంటి దారుణాలకే పాల్పడ్డారు. దీంతో భారీగా హిందువులు మతమార్పిడులకు గురయ్యారు. స్వాతంత్ర్యం ముందు వరకూ భారత్ లో మతమార్పిడులు అన్నీ బలవంతంగానే జరిగాయి. మతం మారకపోతే జీవితంపై ఆశలు వదులుకోవాల్సిన దశలో విధిలేక మతం మారినవారున్నారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత సనాతన ధర్మంలో లేనిపోని లొపాలను సృష్టించి మతమార్పిడులు చేయడం మొదలుపెట్టారు.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హిందూ ధర్మంలో కొన్ని లోపాలూ ఉన్నాయి. సరిగ్గా విశదీకరిస్తే దాదాపు అన్నిమతాల్లోనూ లోపాలున్నాయి. కాలానుగుణంగా వీటిని సరిచేసుకుని ముందుకు వెళితేనే మానవ మనుగడతో పాటు మతమూ ముందుకు సాగుతుంది. లేకపోతే రాతియుగం నాటి ఆచారాలను కూడా ఆధునిక యుగంలో పాటించాల్సిన అఘాయిత్యం ఏర్పడుతుంది. ఇదేవిధంగా హిందూ మతం కూడా కాలానుగుణంగా ఎన్నో సంస్కరణలు చేసుకుంది. ఆదిశంకరాచార్యుల నుంచి వివేకానంద వరకు అనేకమంది హిందూ ధర్మాన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు. ఇందులో దాదాపు అన్నింటినీ హిందూ ధర్మం సంస్కరించుకున్నా,.. కుల వివక్షను మాత్రం పూర్తిగా రూపుమార్చుకోలేకపోయింది. ఇప్పటికీ అక్కడక్కడా కులవివక్ష కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. దీంతో ఈ లోపాన్నే ఇతర మతాలు ఆధారంగా చేసుకుని భారీగా మతమార్పిడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే క్రైస్తవ మతం దీని ఆధారంగా వేలాదిమందిని మతమార్పిడీ చేసింది. దీనికి విదేశీ నిధులు కూడా సమకూరుతున్నాయి. సేవ పేరిట విద్యాలయాలు, ఆసుపత్రులు కట్టించి వాటి ముసుగులో యదేశ్చగా మతమార్పిడులకు పాల్పడుతున్నాయి. అయితే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక విదేశీ నిధులకు పక్కా లెక్కలు తీయడం మొదలవడంతో ఈ నిధుల దారి మళ్ళింది. ఒకప్పుడు నేరుగా వచ్చిపడే నిధులు కాస్తా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే ఇందులో కార్పొరేట్ సంస్థలు పాలుపంచుకోవడం కాస్తంత ఆందోళనకరంగా మారింది.

తాజాగా అమెజాన్ సంస్థ భారత్ లోని మతమార్పిడీ మిషనరీలకు నిధులు సరఫరా చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆల్ ఇండియా మిషన్ అనే మిషనరీ సంస్థ ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా మతమార్పిడులకు పాల్పడుతోంది. దాదాపు 400 కంటే ఎక్కువ చర్చ్ లను నడుపుతోన్న ఈ సంస్థ ప్రతియేటా 25 వేల మందిని మతమార్పిడీ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటువంటి సంస్థకు అమెజాన్ లాంటి అతిపెద్ద ఈకామర్స్ సంస్థ ఫండ్ రైజింగ్ చేసింది. గిఫ్ట్ కార్డ్ ల పేరిట అనాధలకు సహాయం చేయమంటూ తన వెబ్ సైట్ లో ప్రచారం చేసింది. ఈ సంచలన విషయాన్ని సోషల్ జస్టిస్ ఫోరం అనే సంస్థ వెలుగులోకి తీసుకురావడంతో బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఈ స్వచ్చంద సంస్థ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంకు ఫిర్యాదు చేసి అమెజాన్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఎన్‎సీపీసీఆర్ పంపిన నోటీసులకు అమెజాన్ ఏమాత్రం స్పందించలేదు. దీంతో నవంబర్ ఒకటో తేదీన తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకుంటే అరెస్టు చేస్తామని ఎన్‎సీపీసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధంగా అడ్డదారులు తొక్కి అయినా భారత్ లో మతమార్పిడులను చేసేందుకు ఆయా మతాలు ప్రయత్నిస్తున్నాయి.

అయితే హిందూ మతంలో కుల వివక్ష వల్ల కొంతమంది బౌద్దమతంలోకి కూడా మారుతున్నారు. రాజస్తాన్ లో కొంతమంది అగ్రకులాల వారు దళితుల మీద దాడి చేశారు. దీంతో ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక దాదాపు 250 మంది గ్రామస్తులు బౌద్దమతంలోకి మారారు. అప్పటికే పోలీసులు స్పందించి అగ్రకులాలవారిపై ఎస్సీ ఎస్టీ కేసులను పెట్టినా దళితులు బౌద్దమతంలోకి మారారు. ఇటువంటి సంఘటనలను గతంలో క్రైస్తవ సంఘాలు ఎక్కువగా వాడుకునేవి. ఒకరకంగా గ్రామస్థుల్లో లేనిపోని దుష్ప్రచారాన్ని కూడా నూరిపోసి మతమార్పిడీ చేసేవి. అయితే ఇప్పుడు కొంతమంది బౌద్దమతాన్ని ఆశ్రయించి హిందూ దేవీదేవతల ఫోటోలను నదుల్లో పారేసి వీడియోలు సైతం తీస్తున్నారు.

మరి వేల సంవత్సరాలుగా సనాతన ధర్మం ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని అబ్రహామిక్ మతాల దాడులను సైతం ఎదుర్కొని నిలబడగలిగింది. ఇందంతా హైందవ ధర్మంలోని గొప్పదనమే. వేల సంవత్సరాలుగా సంస్కరణలను సైతం స్వీకరించి ముందుకు సాగుతోంది సనాతన ధర్మం. అందుకే అబ్రహామిక్ మతాల ధాటికి అన్ని నాగరికతలూ తుడుచుకుపోయినా,.. భారత్ లోని సంస్కృతి మాత్రం సజీవంగా నిలిచే ఉంది. ఇక అక్కడక్కడా ఉన్న కుల వివక్ష కూడా సమసిపోతే మతమార్పిడులు దాదాపు తగ్గిపోయే అవకాశముంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 + 20 =