ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. జగన్, విజయసాయి ఇద్దరి బెయిల్ పిటిషన్లను రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే..! వీటిపై విచారణ జరిపిన కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. బెయిల్ రద్దు చేయాలంటూ థర్డ్ పార్టీకి పిటిషన్లు వేసే అర్హత లేదని విచారణ సందర్భంగా జగన్, విజయసాయి తరపు లాయర్లు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు పిటిషన్లను డిస్మిస్ చేసింది.
రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు అవ్వడం లేదని రఘురామ తన పిటీషన్ లో కోరారు.