రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర ఆడియో-విజువల్ మార్గాల ద్వారా నిర్వహించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు నివాళులర్పించారు. కరోనా కాలంలో మా రిలయన్స్ కుటుంబం ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిందని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఈ కష్ట కాలంలో మానవాళికి సేవ చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాము. కరోనా కాలంలో రిలయన్స్ కుటుంబం గొప్ప పని చేసింది.. మా వ్యవస్థాపక చైర్మన్ ధీరూభాయ్ అంబానీ ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్ళిందని మాకు నమ్మకం ఉందని అన్నారు. దేశం గురించి, మా ఉద్యోగుల గురించి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సంస్థ, చాలా మంది ఉద్యోగులు, వాటాదారులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. వారి కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ గత సంవత్సరంలో దాదాపు 75,000 కొత్త ఉద్యోగాలను సృష్టించిందని ముఖేష్ వెల్లడించారు. ఆర్‌ఐఎల్ భారతదేశపు అతిపెద్ద వస్తువుల ఎగుమతిదారుగా కొనసాగుతోంది. ప్రైవేటు రంగంలో కస్టమ్స్ ,ఎక్సైజ్ సుంకాలను అత్యధికంగా చెల్లించే కార్పోరేట్ సంస్థగా ఉంది. మేము ప్రైవేటు రంగంలో అత్యధిక జీఎస్టీ, వ్యాట్ & ఐటీ చెల్లింపుదారులలో ముందు వరుసలో నిలిచామని అన్నారు. మేము గత సంవత్సరంతో పోలిస్తే ఈక్విటీ క్యాపిటల్‌లో రూ .3.24 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించాము. మా వినియోగదారుల వ్యాపారాల నుంచి గణనీయమైన పెరుగుదలతో మా ఏకీకృత ఆదాయం దాదాపు 5,40,000 కోట్లు చేరిందని అన్నారు.
మహమ్మారికి వ్యతిరేకంగా మన దేశం చేస్తున్న పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ చేస్తున్న సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానని ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తెలిపారు. గత 15 నెలల్లో ముఖేష్, నేను ఈ కష్ట సమయాల్లో మన దేశానికి, మన ప్రజలకు సహాయం చేయడానికి మనం చేయగలిగినదంతా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కరోనాతో పోరాడటానికి రిలయన్స్ ఫౌండేషన్ ఐదు మిషన్లను ప్రారంభించింది. మిషన్ ఆక్సిజన్, మిషన్ కోవిడ్ ఇన్ఫ్రా, మిషన్ అన్నా సేవా, మిషన్ ఎంప్లాయీ కేర్, మిషన్ వ్యాక్సిన్ సురక్ష అని తెలిపారు.
ఈ ఏడాది భారతదేశం ఆక్సిజన్ కొరతను ఎదుర్కొందని.. రిలయన్స్ వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకుందని తెలిపారు. అధిక స్వచ్ఛత కలిగిన మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి, మేము మా జామ్‌నగర్ రిఫైనరీని కొన్ని రోజుల్లో పునర్నిర్మించాము. రెండు వారాల్లోనే మేము రోజుకు 1100 మెట్రిక్ టన్నుల భారీ ఉత్పత్తిని పెంచామని అన్నారు. సంస్థ చేసిన మరిన్ని పనులను కూడా ఆమె పంచుకున్నారు. భారత్‌కు మాస్ వ్యాక్సినేషన్ అత్యంత కీలకమని.. మేము 116 వ్యాక్సినేషన్ సెంటర్లను 109 పట్టణాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే రిలయన్స్ కుటుంబంలోని 20 లక్షల మందికి ఉచితంగా టీకాలు ఇచ్చామని తెలిపారు.