More

  భారతీయత చుట్టే ప్ర‘దక్షిణం’..! బాలీవుడ్ నేర్చేదెన్నడో..?!

  ఇటీవలే విడుదలైన కాంతార సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‎ను సంపాదించింది. ఇప్పటికే 280 కోట్ల కలెక్షన్లు సంపాదించి మూడొందల కోట్ల మార్కుకు దగ్గరగా దూసుకెళుతోంది. అయితే ఇంతటి భారీ హిట్‎ను అటు దర్శకుడు కానీ నిర్మాత కానీ అస్సలు ఊహించలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా కాబట్టి కొద్దో గొప్పో వసూళ్ళు రావచ్చునని తీసిన సినిమా కాస్తా ఏకంగా పాన్ ఇండియా రేంజ్‎కు ఎదిగిపోయింది. దీంతో పాటు కొద్దిరోజుల క్రితం వచ్చిన కార్తికేయ-2 సినిమా కూడా ఉన్నపళంగా పాన్ ఇండియా రేంజ్‎కు ఎదిగిపోయింది. మొదట్లో తక్కువ థియేటర్లలో ఆడినా కూడా దీనికి లభించిన ఆదరణతో మెల్ల మెల్లగా సినిమా టాకీస్ లను పెంచుకుంటూ పోయారు నిర్మాతలు. అయితే ఈ రెండు సినిమాల్లో ఒక సారూప్యత ఉంది. అదే భారతీయ సంస్కృతి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ విషయాన్ని మాత్రం అంగీకరించక తప్పదు. కాంతార సినిమాలో గిరిజనులు తమ భూమి కోసం పోరాడే సన్నివేశాలున్నా కూడా, అందులో ముఖ్యంగా పంజుర్లి దేవతను చూపించడమే సినిమాకు ఇంతటి ఆదరణను తెచ్చిపెట్టింది. కర్ణాటకలో సాంప్రదాయ దేవత అయిన పంజుర్లి దేవత కొల్లం వేసే నాటకంలో దేవతలోని హావభావాలను హీరో రక్తి కట్టించాడు. సినిమా చూసిన వారు ఆద్యంతం దైవాన్నే చూసిన భ్రమ వచ్చేలా ప్రేక్షకులను ముగ్దులను చేశాడు హీరో. అమ్మవారు గ్రామ దేవతలవైపు నిలబడటం, వారి భూ సమస్య గురించి విలన్ తో మాట్లాడటం, అతడు ఒప్పుకోకపోయినా గిరిజనులకు న్యాయం జరిగేలా చూడటం వంటి సన్నివేశాలు సినిమాలో ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమా చూసినంతసేపూ మనలో దైవశక్తి ఆవహించినట్లు ఉంటుంది. ఇక కార్తికేయ-2 సినిమాలో కూడా కృష్ణుడి గురించి వివరించడం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అందుకే ఈ రెండు సినిమాలు కూడా తక్కువ బడ్జెట్లో తీసినా కూడా భారీ కలెక్షన్లనే సంపాదించాయి. ఒకటి టాలీవుడ్, మరొకటి శాండల్ వుడ్ సినిమాలైనా కూడా పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్లను రాబట్టాయి.

  అయితే ఈ సినిమాలే కాకుండా బాలీవుడ్ లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్, టాలీవుడ్ ట్రిపులార్, పొన్నియన్ సెల్వన్, లాంటి సినిమాలు కూడా బాలీవుడ్ రేంజ్‎లో కలెక్షన్లను సాధించాయి. ఈ మూడు సినిమాల్లో కూడా ఒక సారూప్యత ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో పండిట్ల చరిత్ర చూపితే,.. ట్రిపులార్ లో ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల గురించి, పొన్నియన్ సెల్వన్ సినిమాలో చోళుల కాలంనాటి విషయాలను చూపడం వంటివి జరిగింది. అయితే ఈ మధ్యన నాన్ బాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‎కు ఎదుగుతుంటే,.. అదే సమయంలో బాలీవుడ్ సినిమాలు వరుస ఫ్లాపులను చవిచూస్తోంది. మరి బాలీవుడ్ వరుస ఫ్లాప్ లను చవిచూడటానికి, నాన్ బాలీవుడ్ సినిమాలు వరుస హిట్లను అందుకోవడానికి మధ్య ఎంతో అంతరం ఉంది. ఈ అంతరాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను.

  Cinema is a mirror by which we often see ourselves.. అంటారు మెక్సికన్ డైరెక్టర్ అలెజాండ్రో గాంజలేజ్ ఇనారిటు. సినిమా అనేది ప్రేక్షకుడు తనను తాను తొంగిచూసుకునే అద్దం లాంటిది కాబట్టి సినిమాను ప్రేక్షకుడి ఇష్టాన్ని అనుసరించి తీయవలసి ఉంటుంది. చిత్రంలోని కథ, పాత్రధారులు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు ఉండాలి. ఒకవేళ సినిమాలో డైరెక్టర్ తన సొంత భావజాలాన్ని రంగరించి తీసినా,.. అది ప్రేక్షకుడు ఒప్పుకునే విధంగా ఉంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. కానీ, ఈ సూత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్లు దశాబ్దాలుగా తుంగలోకి తొక్కారు. సినీ డైరెక్టర్లంతా తాము ఏది తీసినా ప్రేక్షకులు చూస్తారు అనే భ్రమలోనే ఉండేవారు. దీనికి తోడు హీరోలు కూడా అదే మూస ధోరణిలో ఉండేవారు. ప్రేక్షకుల ఇష్టాలకు పూర్తి భిన్నంగా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే అండర్ వరల్డ్ డాన్ లను హీరోలుగా చిత్రీకరించడం, భారతీయ మూలాలను తీవ్రంగా అవమానించడం వంటివి కోకొల్లలుగా జరిగాయి. విలన్లకు విభూది బొట్లు పెట్టడం, రుద్రాక్షలు ధరింపజేయడం అదే సమయంలో హీరోకు ఇటువంటివేమీ పెట్టకపోవడం వంటివి చేసి అవమానించారు. అది కూడా హిందూ దేవుళ్ళ పేరుతో సినిమాలు తీసి అందులోనే అవమానించే ప్రయత్నాలు జరిగాయి. ఆశ్రమ్ అనే సినిమాలో హిందూ సాధువులను అవమానించారు. ఎవరో ఎక్కడో కొంతమంది చేసిన చెడును అందరికీ ఆపాదించేలా ఈ సినిమాను నిర్మించారని ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. దీంతో పాటు ‘షిర్డీ కే సాయిబాబా’ అనే సినిమాలో జిహాద్ ను ప్రోత్సహించేలా సినిమాలు తీసారనే ఆరోపణలను ఎదుర్కొంది. ఇక పీకే సినిమాలో అయితే చెప్పనక్కర్లేదు. ఏకంగా దేవాలయంపై ఉచ్చ పోసే సన్నివేశాలను సైతం సెక్యులరిజం ముసుగులో తీసి చూపారు. అభిషేకానికి పాలు వాడితే వృధా అవుతాయని, హిందూ దేవతలు కనబడుటలేదనే పోస్టర్లతో బాలీవుడ్ లోని ద్వేషాన్నంతా ఒకే సినిమాలో కక్కినట్లు ఈ సినిమాను తీసారు. దీంతో పాటు దేశాన్ని అనుక్షణం కాపాడే సైనికులను లాల్ సింగ్ చద్దా సినిమాలో వెర్రిబాగులోడిగా చిత్రీకరించడం లాంటివి చేశారు. అయితే ఈ సినిమాలు తీసిన హీరోలకు ఈ ధోరణి ఒకప్పుడు చెల్లినా ఇప్పుడు చెల్లదనే వాస్తవాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. తామేది చేసినా ఒప్పే అనే ధోరణిలో కొనసాగారు. అప్పుడప్పుడూ ప్రేక్షకులు వారిని ప్రశ్నించినా అదే మూర్ఖత్వ ధోరణితో సమాధానమిచ్చేవారు. పీకే సినిమాపై వ్యతిరేకత వచ్చినప్పుడైతే అమీర్ ఖాన్ తన సినిమాను చూస్తే చూడండి లేకపోతే మానేయండి అని సమాధానమిచ్చాడు.

  అయితే పరిస్థితులు ఎల్లప్పడూ మనకు అనుకూలంగా ఉండవు. ఏ వ్యవస్థ అయినా పతనావస్థలోకి వెళ్ళినప్పుడు దాన్ని భర్తీ చేయడానికి మరో వ్యవస్థ పుట్టుకొస్తుంది. ఇదే విధంగా బాలీవుడ్ చిత్రపరిశ్రమ పతనావస్థకు చేరుకుంటుండటంతో ఆ స్థానాన్ని నాన్ బాలీవుడ్ సినిమాలు భర్తీ చేయడం మొదలవుతోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాలు భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. దీంతో పాటు భారత స్వాతంత్ర్య వీరులను గొప్పగా చూపుతూ తీసే సినిమాలు కూడా మంచి ఆదరణ ను పొందుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా కాంతార, కార్తికేయ సినిమాలతో పాటు ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు భారీ హిట్ ను సంపాదించాయి. దీన్ని ఆదర్శంగా తీసుకుని బాలీవుడ్ సినిమాలు ఇకనైనా పూర్వ వైభవాన్ని పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంతమంది హీరోలు ఈ విధమైన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవలే అక్షయ్ కుమార్ హీరోగా విడుదలైన రామ్ సేతు సినిమాలో శ్రీరాముడి ప్రేమ వారధి రామ సేతు గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అది రామాయణ కాలంలో నిర్మించిన కట్టడమే అని నిరూపించడంతోపాటు, రామాయణ కాలంనాటి ఎన్నో ప్రాంతాలను ఆ సినిమాలో చిత్రీకరించారు. దీంతో ఈ సినిమాల కూడా ఇప్పుడు మంచి కలెక్షన్లనే రాబడుతోంది.

  Making a mistake is normal; it turns abnormal when it’s not recognized..!.. అంటారు ప్రఖ్యాత రచయిత ఇస్రాయెల్‏మోర్ అఈవోర్. తప్పులు చేయడం సహజమే కానీ వాటిని సరిదిద్దుకోలేకపోవడం మాత్రం అతి పెద్ద తప్పిదమే అవుతుంది. బాలీవుడ్ కూడా గతంలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఎన్నో తప్పులను చేసింది. వీటిని సరిదిద్దుకుని మళ్ళీ పునర్వైభవం సంతరించుకుంటే అటు బాలీవుడ్ పరిశ్రమతో పాటు ప్రేక్షకులకు కూడా మంచి జరుగుతుంది. లేకపోతే,.. పతనావస్థలో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ శూన్యతను ఇతర నాన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలు ఆక్రమించే కాలం ఎంతో దూరంలో ఉండబోదనే చేదు నిజాన్ని గ్రహించక తప్పదు.

  Trending Stories

  Related Stories