ఢిల్లీలోని ఎర్రకోటను ఆగష్టు15 వరకూ మూసివేస్తున్నారు. ఈ విషయాన్ని పురావస్తు శాఖ స్పష్టం చేసింది. సాధారణ ప్రజలకు, పర్యాటకులు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ పురావస్తు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో డ్రోన్ల దాడి జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వారం రోజుల ముందు ఎర్రకోటను మూసివేస్తారు. ఈసారి నిఘా వర్గాల హెచ్చరికలు, ఢిల్లీ పోలీసుల సూచనలతో పురావస్తు శాఖ నేటి నుండి ఆగష్టు 15 వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేయడంతోపాటు ఆంక్షలు విధించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. డ్రోన్ల సాయంతో ఢిల్లీపై దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీంతో ఎర్రకోట చుట్టూ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. భద్రతా దళాలకు డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో జులై 21 నుంచి ఆగష్టు 15 వరకు ఎర్రకోటను మూసివేస్తున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఆగస్టు 15కి ముందే డ్రోన్లతో దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఆగష్టు 5న ఢిల్లీలో డ్రోన్ల దాడి జరిపేందుకు పాక్ ఉగ్రమూకలు కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో అదే తేదీన ఢిల్లీలో దాడి జరిపేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని భద్రతా బలగాలు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి.
హెచ్చరికలు.. హై అలర్ట్:
ఆగష్టు 15 లోపే తీవ్రవాదులు ఉగ్రదాడికి ప్రణాళికలు రచిస్తున్నారనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు చేరింది. కేంద్ర నిఘా వర్గాలు భారీ ఉగ్రదాడి జరగొచ్చని ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. డ్రోన్ల సాయంతో ఢిల్లీపై విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఆగష్టు 5 న ఉగ్రదాడికి అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. అదే రోజున ఈ ఆపరేషన్ చేపట్టడానికి ఉగ్రవాదులు డ్రోన్ దాడిని ప్లాన్ చేస్తున్నారని ఏజెన్సీలు హెచ్చరించాయి. సమాచారం వచ్చిన తరువాత ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్లను ఉపయోగించి ఉగ్రవాద దాడులు చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ మద్దతు ఉన్న టెర్రర్ గ్రూపులు ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భంగం కలిగించవచ్చని భద్రతా సంస్థలు తెలిపాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులు సన్నద్దమయ్యారు. ఈ మేరకు పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలపై శిక్షణ ఇవ్వాలని ఆయా జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆగష్టు 15 లోపుగా శిక్షణ ఇవ్వనున్నారు. నగరంలోని డ్రోన్ లకు సంబంధించిన సమాచారం గురించి జిల్లాలోని ఎస్‌హెచ్‌ఓలు తెలుసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎర్రకోట వద్ద నాలుగు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. 30వేల మంది పోలీసులు నగరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.