More

  ఎర్రకోట విధ్వంసం ఖలిస్తానీల పనే : ఢిల్లీ పోలీసులు

  గణతంత్ర దినోత్సవం రోజున.. ఎర్రకోట వద్ద నకిలీ రైతులు చేసిన హింస.. అంతర్జాతీయంగా దేశానికి అపఖ్యాతిని తీసుకొచ్చింది. ఆందోళన జీవులు దేశ సార్వభౌమత్వానికే మచ్చతెచ్చారు. నాడు అనుమానించిందే నిజమైంది. ఇది రైతుల ముసుగులో ఖలిస్తానీలు చేసిన కుట్ర అని సాక్ష్యాధారాలతో రుజువైంది. ఈ ఆందోళనలో పాల్గొన్న ఖలిస్తానీ మూకల్ని గుర్తించిన ఢిల్లీ పోలీసులు 3,244 పేజీలతో ఛార్జ్ షీట్ ను రూపొందించారు. కోర్టుకు సమర్పించిన ఈ సుదీర్ఘ ఛార్జ్ షీట్ లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగుచూశాయి. ఇది రైతుల ముసుగులో ఖలిస్తానీ మూకలు పక్కా ప్రణాళికతో చేపట్టిన హింస అని తేలిపోయింది. ఇందుకోసం ఖలిస్తానీ మూకలు కత్తులు, ఇనుపరాడ్లు, బరిసెలు, మంచం కోళ్లు సిద్ధం చేసుకున్న వైనం షాక్ కు గురిచేస్తోంది.

  ఈ హింసోన్మాదంలో ప్రవాసీ ఖలిస్తానీ అనుకూల ఉగ్రవాదుల ప్రమేయం వున్నట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. హింస జరుగుతున్న సమయంలో ఎర్రకోట కాంప్లెక్స్ లోనే వున్న ఇక్బాల్ సింగ్ అనే 45 ఏళ్ల ఖలిస్తానీకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఇది కెనడా నుంచి వచ్చిన ఫోన్ కాల్ గా పోలీసులు గుర్తించారు. లూధియానాను చెందిన ఇక్బాల్ సింగ్ ను ఫిబ్రవరి 10న పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రకోట వద్ద జన సమూహాన్ని ప్రేరేపించిన వ్యక్తులలో ఇక్బాల్ సింగ్ కూడా ఒకరు. సెక్యూరిటీ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేయడానికి ఇక్బాల్ జన సమూహాన్ని ప్రేరేపించే వీడియోను కూడా చార్జిషీట్లో పేర్కొన్నారు.

  అంతేకాదు, మనవద్ద కర్రలు కూడా వున్నాయి.. వాటిని సిద్ధంగా వుంచండి అని ఇక్బాల్ సింగ్ నినాదాలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండా విజయవంతంగా ఎగురవేస్తే.. సిక్స్ ఫర్ జస్టిస్ గ్రూప్ నుంచి తనకు భారీ మొత్తంలో నగదు కూడా ఆఫర్ చేశారని ఇక్బాల్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇక్కడ గమనించాల్సి విషయం ఏమిటంటే.. అంతకుముందు ఇదే నిషేధిత ఖలిస్తానీ సంస్థ.. రిపబ్లిక్ డే రోజున ఇండియా గేట్, ఎర్రకోట వద్ద ఖలిస్తానీ జెండా ఎగురవేసినవాళ్లకు.. 2 లక్షల 50 వేల డాలర్లను ప్రైజ్ మనీగా ప్రకటించింది. దీనికి సంబంధించి సిక్స్ ఫర్ జస్టిస్ గ్రూప్ ఓ లెటర్ తో పాటు.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు గురుపట్వంత్ సింగ్ పన్ను మాట్లాడిన వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలోనే క్విక్ మనీ కోసం చూస్తున్న కొందరు నిరసనకారులకు పన్ను క్యాష్ రివార్డును ప్రకటించారు. అంతేకాదు, జనవరి 26 వస్తోంది. ఎర్రకోట మీద మూడు రంగుల జెండాను తొలగించి.. ఖలిస్తానీ జెండాను ఎగురవేయాలని నిరసనకారులకు పన్ను పిలుపునిచ్చాడు.

  ఇక ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. నిందితుడు ఇక్బాల్ సింగ్ 2009లో కెనడాకు వెళ్లినప్పుడు.. టొరంటోలోని ఓ గురుద్వారాలో పనిచేశాడని వెల్లడించారు. పంజాబ్ లో ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఈ గురుద్వారా ఎంతో ప్రసిద్ధిగాంచింది. పోలీసులకు మరో ముఖ్యమైన ఆడియో రికార్డు కూడా లభించింది. ఇందులో నిందితుడు ఇక్బాల్ సింగ్ కుమార్తె.. తన బంధువులతో మాట్లాడుతూ.. 50 లక్షల రూపాయలు ఆఫర్ చేసినట్టుగా వుంది. ఈ ఛార్జ్ షీట్ ద్వారా గణతంత్ర దినోత్సవం రోజున హింసకు సహాయపడటంలో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు ప్రధాన పాత్ర పోషించినట్టు స్పష్టమైన ఆధారాలు వెలువడుతున్నాయి. మొత్తానికి, ఢిల్లీ పోలీసుల ఛార్జ్ షీట్ తో ఆందోళన చేస్తున్న సోకాల్డ్ ఫార్మర్స్ తో పాటు.. కరోడ్ పతి రాకేష్ టికాయత్ ముసుగు తొలగిపోయింది.

  Trending Stories

  Related Stories