ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ-శివసేనల మధ్య మైత్రి ఎంతో అన్యోయంగా సాగింది. అయితే కొన్ని కారణాల వలన ఇటీవలి కాలంలో శివసేన భారతీయ జనతా పార్టీకి దూరం అయ్యింది. ఈ మధ్య కాలంలో శివసేన-బీజేపీ మధ్య బంధం మరింత పటిష్టమవుతూ ఉన్నట్లు తెలుస్తోంది. మహా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మిత్రులైన బీజేపీ, శివసేన మళ్లీ కలిసే అవకాశం ఉందా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన మాట్లాడుతూ.. శివసేన తమకు ఎప్పుడూ శత్రువు కాదని అన్నారు. శివసేన తమకు మిత్రుడేనని.. అయితే ఎవరిపైన అయితే గతంలో కలిసి పోరాడామో… ఇప్పుడు వారితోనే కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజకీయాల్లో ఏదీ స్థిరంగా ఉండదని పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. విపక్షాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని శివసేన, ఎన్సీపీ వ్యాఖ్యానించాయి. సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు రాబోతున్నాయనే ప్రచారం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అగాథం నెలకొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు ఈ రెండు పార్టీలు చెరో దారి చూసుకున్నాయి. చివరకు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇక శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా శివసేన-బీజేపీ మైత్రిపై తనదైన రీతిలో స్పందించారు. తామేమీ భారత్-పాకిస్థాన్ లాంటి వాళ్లం కాదని ఆయన చెప్పారు. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్-కిరణ్‌రావుల బంధం లాంటిదే తమ బంధం కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ రెండు పార్టీల రాజకీయ మార్గాలు వేరైనా.. తమ మధ్య స్నేహ భావం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. బీజేపీ నేత ఆశిష్ షెలార్‌ను కలుసుకోవడంపై సంజయ్ రౌత్ ఆదివారంనాడు వివరణ ఇచ్చారు. తామిద్దరూ ఒక వేడుకలో కలిశామని, గిట్టని వాళ్లు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు దీనిని ముడిపెట్టి ఏవేవో వదంతలు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర రాజకీయాలు భారత్, పాక్ తరహా రాజకీయాలు కావు. రాజకీయ వైరుధ్యాలున్నప్పటికీ మేమంతా సుహృద్భావంతోనే ఉంటాం. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముడిపెట్టి జనం ఏవేవో వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. అందులో వాస్తవం లేదని సంజయ్ రౌత్ అన్నారు.