ప్రధాని మోదీ కాన్వాయ్ ను అడ్డుకుంది వాళ్లే

0
895

పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ కాన్వాయ్ ని అడ్డుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రధాని సెక్యూరిటీ విషయంలో అజాగ్రత్త కనబరిచిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఫ్లైఓవర్ పై ఆగిపోయింది. ఈ భద్రతా వైఫల్యానికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు తామే కారణమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించుకుంది. ప్రధానికి నిరసనను తెలిపేందుకు పియారియానా గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు వచ్చామని తెలిపింది. ఏడు కిసాన్ యూనియన్లు డిసెంబర్ 31న భేటీ అయ్యాయని… ప్రధాని పర్యటన సందర్భంగా భారీ నిరసన తెలపాలని ఆ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని చెప్పింది.

ఈ ఘటన జరిగిన ప్రదేశం నుంచి మోదీ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద ఉన్న పంజాబ్ రాష్ట్ర అధికారులతో ఆయన మాట్లాడుతూ, ‘భతిండా ఎయిర్ పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్’ అని అన్నారు. ఈ ఘటన వల్ల ప్రధాని మోదీ ఫిరోజ్ పూర్ ర్యాలీ రద్దయింది.

పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఈ ఘటనపై స్పందిస్తూ… జరిగిన దానికి విచారం వ్యక్తం చేశారు. మోదీపై దాడి చేసే పరిస్థితులు అక్కడ చోటు చేసుకోలేదని.. ప్రధాని భద్రతా ఏర్పాట్లన్నీ కేంద్ర ఏజెన్సీల చేతుల్లోనే ఉంటాయని.. ఆయన భద్రత విషయంలో పంజాబ్ పోలీసుల పాత్ర చాలా తక్కువని అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బందిని విధుల్లో పెట్టామని పంజాబ్ అడిషనల్ డీజీపీ చెప్పారు. యాంటీ డ్రోన్ బృందాన్ని కూడా మోహరింపజేశామని తెలిపారు.