ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్స్ దాడి చోటు చేసుకున్న 24 గంటల్లోనే మరో రెండు డ్రోన్లను భారత సైన్యం కూల్చి వేసింది. జమ్ములోని కాలుచాక్ మిలిటరీ స్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి కనిపించాయి. రాత్రి 11.30 నిమిషాలకు ఓ డ్రోన్ ఆర్మీ బేస్‌పై ఎగురుతూ కనిపించగా, మరొకటి అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల ప్రాంతంలో కనిపించింది. ఆర్మీ జవాన్లు వాటిపై ఫైరింగ్ జరిపారు. జమ్ము పఠాన్‌కోట్ నేషనల్ హైవేపై కాలుచాక్-పూర్మాండల్ ప్రాంతంలో రెండు క్వాడ్‌కాప్టర్స్ కనిపించాయి. కాలుచాక్ మిలిటరీ స్టేషన్‌కు దగ్గరగా ఎగురుతూ కనిపించాయి అని పోలీసులు వెల్లడించారు. ఆర్మీ జవాన్లు 20-25 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలతో జమ్ము ప్రాంతంలోని ఆర్మీ స్టేషన్లలో హై అలెర్ట్ ప్రకటించారు. జమ్ములో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై తొలిసారి డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే ఇలా మరో రెండు డ్రోన్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్లతో దాడి జరిగిన సంగతి తెలిసిందే..! జమ్మూ ఎయిర్ పోర్ట్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఈ దాడి చోటు చేసుకుంది. ఆదివారం నాడు 5 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్ళు చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్ పేలుళ్ల కారణంగా ఇద్దరు అధికారులు గాయపడ్డారని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపింది. ఉదయం 1:37 సమయంలో ఒక బ్లాస్ట్, 1:42 సమయంలో మరో బ్లాస్ట్ చోటు చేసుకుంది.
ఆదివారం తెల్లవారుజామున జమ్మూ వైమానిక స్థావరం వద్ద జరిగిన డ్రోన్ దాడిలో భద్రతా సంస్థలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాద సంస్థ పాత్ర ఉందని తెలుసుకున్నారు. ఈ డ్రోన్ దాడికి సంబంధించి జమ్మూ పోలీసులు 6 కిలోగ్రాముల ఐఇడిని ఎల్‌ఇటి ఆపరేటివ్ నుంచి రికవరీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముగ్గురు తీవ్రవాదులను కూడా నిర్బంధించినట్లు తెలుస్తోంది.
ఈ డ్రోన్ అటాక్ లపై భద్రతా సంస్థలు రాష్ట్ర పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. పాకిస్తాన్ ఆధారిత టెర్రర్ గ్రూప్ ఒక డ్రోన్‌తో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) టవర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్లాన్ చేయగా.. మరొకటి పార్క్ చేసిన ఐఎఎఫ్ హెలికాప్టర్ లేదా రాడార్‌ను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఆ ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. ఆర్.డి.ఎక్స్. తో ఉన్న 5-6 కిలోగ్రాముల బరువున్న రెండు ఐఇడిలు.. 50 గజాల దూరంలో పడిపోయాయి. ఒకటి ఎటిసి నుండి 40 గజాల దూరంలో ఉంది, మరొకటి ఆపి ఉంచిన హెలికాప్టర్ నుండి అదే దూరంలో ఉంది. అక్షాంశ-రేఖాంశాల ద్వారా డ్రోన్లను జారి విరచాలని భావించారు. అయితే లక్ష్యాలను కోల్పోయారని తెలుస్తోంది. అధిక గాలి కారణంగా కూడా లక్ష్యాలను కోల్పోయి ఉండవచ్చని ఒక సీనియర్ భద్రతా అధికారి తెలిపారు.
భద్రతా సంస్థలు మరియు రాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు డ్రోన్లు జమ్మూ విమానాశ్రయం నుండి కేవలం 14.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు మీదుగా ప్రయాణించి, ఢీ కొన్న తర్వాత తిరిగి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్ 1.2 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరినట్లు అనుమానిస్తున్నారు. లాంగ్ రేంజ్ బ్యాటరీల ద్వారా వీటిని నడిపినట్లు తెలుసుకున్నారు.
డ్రోన్ దాడి కారణంగా జమ్మూ సెక్టార్ లో రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. పాకిస్తాన్ టెర్రర్ గ్రూపుల వద్ద 14 డ్రోన్ లు ఉన్నాయని అధికారులు భావిస్తూ ఉన్నారు. వాటిలో ఎక్కువ భాగం ఎల్ఇటి దగ్గర.. మరో రెండు జైష్-ఎ-మొహమ్మద్ తీవ్రవాద సంస్థ దగ్గర ఉన్నట్లు సమాచారం అందింది. సాంబా సెక్టార్లో ఆరు, హిరానగర్ సెక్టార్లో 3 నుండి నాలుగు, నౌషెరా-రాజౌరి సెక్టార్లో 2 మరియు ఆర్నియా సెక్టార్లో మరో రెండు ఆయుధ పేలోడ్లతో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దాడిని కాశ్మీర్లో శాంతికి భంగం కలిగించేందుకే చేశారని స్పష్టంగా అర్థమవుతోంది.