More

  ‘కూసుకుంట్ల’ను గెలిపించిన ‘కల్వకుంట్ల’..! ‘నోటు’కు ‘ఓటు’ క్లీన్‎బౌల్డ్..!!

  రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడు ఎన్నికల్లో చివరివరకు తెగించి పోరాడిన బీజేపీ ఓటమి పాలైంది. రెండు, మూడు రౌండ్లలో ఆధిక్యం కనబరిచినప్పటికీ.. ఆ తర్వాత టీఆర్ఎస్ పుంజుకుని ప్రతి రౌండులో ఆధిక్యం కనబరించింది. మునుగోడులో నిజానికి టీఆర్ఎస్ గెలిచినప్పటికీ.. నైతిక విజయం మాత్రం బీజేపీదేనని చెప్పక తప్పదు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని అనడం కంటే.. డబ్బు, మందు, బీజేపీ స్వీయ తప్పిదాలే గెలిపించాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు మునుగోడులో బీజేపీ ఎందుకు వెనుకబడింది..? ఆ పార్టీ చేసిన తప్పిదాలేంటి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న టీఆర్ఎస్.. మునుగోడు బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. జీవన్మరణ సమస్యగా భావించిన కారు వారి సర్కార్.. అన్ని శక్తులూ ఒడ్డింది. మునుగోడులోని ప్రతి గ్రామానికీ ఓ ఎమ్మెల్యేను, మంత్రులను ఇంఛార్జులుగా నియమించి కథ నడిపింది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే గ్రామస్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులు తిష్టవేశాయి. తాము రాష్ట్రానికి మంత్రులమన్న విషయాన్ని మర్చిపోయిన టీఆర్ఎస్ ఆమాత్యులు.. ఓట్ల కోసం జోలెపట్టారు. అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్యేలంతా నోట్ల కట్టల్ని పంపిణీ చేశారు.

  సరిగ్గా ఇక్కడే బీజేపీ పూర్తిగా వెనుకబడింది. రాజగోపాల్ రెడ్డి రాజకీయ నాయకుడి కంటే వ్యాపారవేత్తగానే అందరికీ తెలుసు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల టీఆర్ఎస్ కు రాజీనామా చేసినప్పుడు.. కారు పార్టీలో భారీ చీలిక వచ్చింది. ఈటల స్వయంగా రాజకీయ నాయకుడు కాబట్టే ఇది సాధ్యమైంది. కానీ, రాజగోపాల్ రెడ్డికి ఇది సాధ్యం కాలేదు. దీంతో తాను బీజేపీలో చేరినా కూడా కాంగ్రెస్ కోర్ ఓటర్ ను తనవైపు తిప్పుకోలేకపోయాడు. దీంతో పాటు మునుగోడులో బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలోకి దూసుకుపోలేదనే వాదనలున్నాయి. బీజేపీ నేతల మధ్య సరిగ్గా సమన్వయం లేకపోవడం కూడా టీఆర్ఎస్‎కు కలిసొచ్చిందనే గుసగుసలు వినబడుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడి రోజులు గడుస్తున్నా,.. అప్పటికే కారు పార్టీ మునుగోడును ముట్టడించినా.. బీజేపీ మాత్రం ప్రచార బరిలోకి దిగలేదు. దీంతో పాటు బీజేపీకి మునుగోడులో సంస్థాగతంగా బలం లేకపోవడంతో.. బూత్ స్థాయిలో సమన్వయం కొరవడింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ నాయకులు మాత్రం బూత్ స్థాయిలో ప్రజలందరినీ కలిసి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.

  పార్టీల పరంగా ఇలా ఉంటే,.. అటు రాజకీయ సమీకరణాలు కూడా మునుగోడు ఓట్లను ప్రభావితం చేశాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పై అసంతృప్తి ఉన్నా కూడా బీజేపీ దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోయింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన కారణం. కారు పార్టీకి సరైన ప్రత్యర్థులం తామే అని బీజేపీ నాయకులు చెప్పుకున్నా,.. మునుగోడులో ఇంకా ట్రయాంగిల్ ఫైట్ జరిగింది దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ చీల్చగలిగింది. దీంతో పాటు మునుగోడులో లక్షా నలభై తొమ్మిది వేల మంది ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నాకూడా ప్రజలు పథకాలిచ్చిన వారిపై సానుభూతి చూపుతారు. ఈ కారణంతో మునుగోడు ఓటర్లలో కారు పార్టీ తన పథకాలను విస్త్రుతంగా ప్రచారం చేసింది. ప్రతిగడపకూ తన పథకాలను ప్రచారం చేసి ఓటర్లను మెప్పించింది.

  ఇక టీఆర్ఎస్ గెలుపులో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ఆ పార్టీ ధనబలం. ఈ విషయంలో బీజేపీ అధికార పార్టీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచి టీఆర్ఎస్ ప్రలోభ పర్వం మొదలుపెట్టింది. మునుగోడులో ప్రతి గ్రామాన్ని మత్తులో ముంచెత్తింది. డబ్బు కట్టలు తెంచుకుని కదం తొక్కింది. వందల కోట్ల ప్రజాధనం.. ఓట్ల కొనుగోలు కోసం కారు పార్టీ ఖర్చు చేసింది. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని.. ఓట్ల వేటలో పకడ్బందీగా నోట్ల పంపిణీ చేసింది. ప్రచారం ముగిసిన తర్వాత కూడా మంత్రులు మారువేషాల్లో డబ్బులు పంచారంటే.. గులాబీ బాస్ మునుగోడును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది. అధికార పార్టీ ఆదేశాలతో అధికార యంత్రాంగం మొత్తం బీజేపీపై నిఘా పెట్టింది. టీఆర్ఎస్ శ్రేణులను చూసీ చూడనట్టు వదిలేసిన పోలీసులు.. బీజేపీ నాయకులను మాత్రం భూతద్దం పెట్టి మరీ పరిశీలించారు.

  మొత్తానికి, గత అనుభవాలు నేర్పిన పాఠాలతో, పకడ్బందీ వ్యూహాలు రచించిన కేసీఆర్.. మునుగోడు జారిపోకుండా చూసుకున్నాడు. అయితే, టీఆర్ఎస్ కు ఇది సంబరాలు చేసుకునేంత గెలుపు కాదన్నది.. కాదనలేని వాస్తవం. రాష్ట్రంలో అధికార పార్టీ ఓ ఉపఎన్నిక కోసం.. రాష్ట్ర మంత్రివర్గం మొత్తాన్ని మోహరించినప్పుడే.. ఆ పార్టీ నైతికంగా ఓటమి పాలైంది. వందల కోట్ల డబ్బును కుమ్మరించి.. ఓటర్లను మత్తులో జోగించి.. తాయిలాలు, పథకాలు పంచినా.. అత్తెసరు మెజారిటీతో బయటపడింది టీఆర్ఎస్.

  ఒక దశలో టీఆర్ఎస్ ఓడిపోతుందేమో అన్న ప్రచారం కూడా జరిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారింది టీఆర్ఎస్ పరిస్థితి. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా అంతగా బాధ పడాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో డిపాజిట్ ను కూడా దక్కించుకోలేని బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించింది. ఇక టీఆర్ఎస్ కు పతనం ప్రారంభమైందనే స్థాయికి చేర్చింది. ఒకరకంగా టీఆర్ఎస్ విజయం బీజేపీకి కలిసొచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే, సాధారణ ఎన్నికల్లో మునుగోడు లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఆ పార్టీకి లభించింది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే అవకాశం లభించింది. ఏదేమైనా, మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు బీజేపీకి ప్రీఫైనల్ గా పనిచేసింది. పైకి విజయం సాధించినా.. మునుగోడు ఫలితం కేసీఆర్ కు అసంతృప్తినే మిగిలించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బహుశా ఇది సంపూర్ణ విజయం అని ఒప్పుకోవడానికి కేసీఆర్ అంతరాత్మ ఒప్పుకుంటుందని అనుకుంటే అది పొరపాటే.

  Trending Stories

  Related Stories