గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన శ్వేత చౌదరి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. శ్వేత గత మూడు నెలలుగా ఇంటి నుంచే పని చేస్తోంది. మరో కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆదివారం కొత్త ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 8 గంటల సమయంలో తాను డిప్రెషన్ లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్లో తల్లికి మెసేజ్ పంపింది. జగ్గయ్యపేట పరిధిలో చిల్లపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పంపింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు.
ఓ ఆన్ లైన్ మోసగాడి బారినపడి ఆమె ఆత్మహత్య చేసుకుంది. రూ.1.2 లక్షలు చెల్లిస్తే రూ.7 లక్షలు వస్తాయని నమ్మబలికిన ఆ మోసగాడు, ఆమె నుంచి డబ్బు కాజేశాడు. అతడి దగ్గర నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో తాను మోసపోయానని భావించిన శ్వేత బలవన్మరణం చెందింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన శ్వేతకు ఓ వ్యక్తి ఆన్ లైన్ లో పరిచయం అయ్యాడు. మొదట రూ.1.2 లక్షలు చెల్లించాలని అతడు సూచించాడు. తన వద్ద అంత మొత్తం లేవని శ్వేత చెప్పడంతో, అతడే రూ.50 వేలు పంపించాడు. మిగిలిన మొత్తం శ్వేతనే సర్దుబాటు చేసుకుని అతడు చెప్పిన విధంగా ఓ ఖాతాకు బదిలీ చేసింది. గత రెండ్రోజుల నుంచి ఆ వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడంతో శ్వేత ఆందోళన చెందింది. ఆ వ్యక్తి తనను మోసగించాడని భావించిన శ్వేత ఇంటి నుంచి బయటికి వచ్చి చిల్లకల్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.