విజయ్ సేతుపతి.. ఎటువంటి వివాదాలు లేకుండా దక్షిణాది భాషల్లో నటిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి విజయ్ సేతుపతిని ఓ వ్యక్తి బెంగళూరు ఎయిర్ పోర్టులో ఎగిరి తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆగంతకుడిని పట్టుకున్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిని ఏమీ అనకుండా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు విజయ్. విజయ్ సేతుపతిని ఎందుకు తన్నాడో.. అందుకు కారణాలేమిటో ఎవరూ చెప్పలేదు. కానీ సెటిల్ చేసుకున్నారు.. కేసులు లేకుండా అనే కథనాలు మాత్రం వినిపించాయి. తాజాగా ఈ దాడి వెనుక చోటు చేసుకున్న కారణాలకు సంబంధించిన విషయాలను తమిళ మీడియా ఛానల్స్ తెలియజేశాయి.
దాడి చేసిన వ్యక్తి పేరు జాన్సన్. కేరళకు చెందిన అతడు ఉద్యోగం నిమిత్తం బెంగళూరులో ఉంటున్నాడు. విమానాశ్రయం నుంచి వెళ్తున్న క్రమంలో విజయ్ సేతుపతిని సెల్ఫీ అడిగాడట. అందుకు నిరాకరించిన సేతుపతి వ్యక్తిగత అంగరక్షకులు.. జాన్సన్ ను పక్కకు తోసేశారట. అప్పటికే తాగిన మత్తులో ఉన్న ఆ వ్యక్తి సేతుపతి బాడీగార్డులు చేసిన పనికి ఆవేశంతో.. పరుగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడట. బాడీగార్డులు వెంటనే అతడిని పట్టుకున్నారు. విజయ్ సేతుపతి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. జరిగిన ఘటనపై సదరు వ్యక్తి.. సేతుపతికి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఎటువంటి కేసులు కూడా పెట్టలేదని తెలుస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు తమిళ నటులు రాలేదనే కోపంతో.. విజయ్ సేతుపతిపై దాడి జరిగిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే అందులో ఎటువంటి నిజం లేదని తర్వాత తేలింది.