రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ ను తక్కువ స్కోరుకే ఓడించి.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.
ఆఖర్లో అనుజ్ రావత్ కేవలం 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 29 పరుగులు చేయడంతో మంచి స్కోరును సాధించింది బెంగళూరు. విరాట్ కోహ్లీ 18 పరుగులే చేసి అవుట్ అవ్వగా, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్ జోడీ అర్ధసెంచరీలతో రాణించింది. డుప్లెసిస్ 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 55 పరుగులు, మ్యాక్స్ వెల్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేశారు. లోమ్రోర్ (1), దినేశ్ కార్తీక్ (0) నిరాశపరిచారు. అనుజ్ రావత్ దూకుడుగా ఆడడంతో ఆర్బీబీ స్కోరు 150 మార్కు దాటింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 2, కేఎం ఆసిఫ్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.
172 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ కు ఏ దశలోనూ టార్గెట్ ను చేధించేలా కనిపించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) ను సిరాజ్ డకౌట్ చేశాడు. అలా మొదలైన పతనం 10.3 ఓవర్ల వరకూ సాగింది. రాజస్థాన్ రాయల్స్ 59 పరుగులకు కుప్పకూలింది.ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ డకౌట్ కాగా… కెప్టెన్ సంజూ శాంసన్ (4), జో రూట్ (10) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. షిమ్రోన్ హెట్మెయర్ 19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 35 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ (4) ధ్రువ్ జురెల్ (1), రవిచంద్రన్ అశ్విన్ (0), ఆడమ్ జంపా (2), కేఎం ఆసిఫ్ (0) ఏ మాత్రం ప్రభావం చూపలేదు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 1, వేన్ పార్నెల్ 3, మైకేల్ బేస్వెల్ 2, కర్ణ్ శర్మ 2, గ్లెన్ మ్యాక్స్ వెల్ 1 వికెట్ పడగొట్టారు.