లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమిని చవి చూసింది. ఆఖరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. ఆఖరి ఓవర్ హైడ్రామా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. కోహ్లీ 61, డుప్లెసిస్ 79, మ్యాక్స్ వెల్ 59 పరుగులు చేశారు.
లక్నో జట్టు లక్ష్యఛేదనలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో విజయం బెంగళూరుదే అని అనుకున్నారు. మార్కస్ స్టొయినిస్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో నికోలాస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. పూరన్ మొత్తం 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. కేవలం 15 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి ఐపీఎల్ 2023లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. ఈ సీజన్‌లో సీఎస్కే ఆటగాడు అజింక్యా రహానే 19 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆఖర్లో బదోనీ 24 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 3, వేన్ పార్నెల్ 3, హర్షల్ పటేల్ 2, కరణ్ శర్మ 1 వికెట్ తీశారు.
బెంగళూరు కెప్టెన్ కు మ్యాచ్ రిఫరీ షాకిచ్చాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ ఫా డుప్లెసిస్ కు భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో ఫీల్డ్ చివరి ఓవర్లో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లనే అనుమతించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారీ స్లో ఓవర్ రేట్ ఉండటంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. తొలి తప్పిదం కావడంతో రూ.12 లక్షల జరిమానా విధించాడు. ఈ సీజన్ లో జరిమానా ఎదుర్కొన్న మొదటి కెప్టెన్ గా డుప్లెసిస్ నిలిచాడు.