ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్ల పాటూ పొడిగించింది. శక్తికాంత దాస్ పునఃనియామకాన్ని కేబినెట్ పునర్నియామక కమిటీ ఆమోదించింది. 10 డిసెంబరు 2021 నుంచి మూడేళ్లపాటు లేదంటే.. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా గతంలో పనిచేసిన శక్తికాంత దాస్ 11 డిసెంబరు 2018లో భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఈ గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్‌లో ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉంది. శక్తికాంత దాస్ పదవీకాలం ముగియడానికి నెలన్నర రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా గాడి తప్పిన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి దారిలో పెట్టడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది.