లోన్ రికవరీ ఏజెంట్లకు సంబంధించిన చర్చ దేశంలో భారీగా సాగుతోంది. లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు కీలక సూచనలు చేసింది. లోన్ రికవరీ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఎనిమిది గంటలకు ముందు, రాత్రి ఏడు గంటల తర్వాత లోన్ తీసుకున్న వాళ్లకు ఫోన్లు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలు, ఇతర రుణ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రుణాలు ఇచ్చే సంస్థలు వారి ఉద్యోగులు గానీ, వారి ఏజెంట్లు గానీ రుణ గ్రహీతలపై ఎలాంటి మానసిక, శారీరక వేధింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రుణాలను తిరిగి వసూలు చేసుకోవడానికి వేధింపులకు పాల్పడటం వంటివి చేయవద్దని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. రుణ గ్రహీతలకు ఎలాంటి తప్పుడు సమాచారం, బెదిరింపులతో కూడిన మెసేజీలు చేయడానికి వీలు లేదని హెచ్చరించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్ బీ ఎఫ్ సీ), అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీలు సహా దేశంలోని అన్ని ఆర్థిక, రుణ సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు, ఎఆర్‌సిలతో సహా నియంత్రిత సంస్థలకు అదనపు సూచనలను జారీ చేస్తూ, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ఈ సూచనలను ఇచ్చింది. “ఆర్‌ఈలు (రెగ్యులేటెడ్ ఎంటిటీలు) లేదా వారి ఏజెంట్లు తమ రుణాల సేకరణ ప్రయత్నాలలో ఏ వ్యక్తికి వ్యతిరేకంగా మౌఖిక లేదా శారీరకంగా ఎలాంటి బెదిరింపులు, వేధింపులకు పాల్పడకుండా ఖచ్చితంగా భాద్యత వహించాలి” అని ఆర్‌బిఐ నోటిఫికేషన్ తెలిపింది.