Sports

బీసీసీఐ, ఐసీసీపై తీవ్ర విమర్శలు చేసిన రవి శాస్త్రి

టీ20 ప్రపంచ కప్ లో భారత్ లీగ్ దశలోనే వెనుదిరిగింది. అతి క్రికెట్ భారత ఆటగాళ్ల కొంపముంచిందని పలువురు విమర్శలు చేశారు. ఐపీఎల్ కు ప్రపంచ కప్ కు ఎక్కువ రోజులు గ్యాప్ లేకపోవడంతో ఆటగాళ్లు అలసిపోయారని కూడా తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ ల అనంతరం జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి తప్పుకున్నారు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఈ టోర్నీలో టీమిండియా పరిస్థితికి బీసీసీఐ, ఐసీసీనే కారణమని ఆరోపించారు. బిజీ షెడ్యూల్ టీమిండియా ఓటములకు పరోక్షంగా కారణమని అన్నారు. గత 6 నెలలుగా టీమిండియా ఆటగాళ్లు బయోబబుల్ లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆటగాడు అయినా శారీరకంగా, మానసికంగా అలసిపోతారని అన్నారు. క్రికెటర్లు కూడా మనుషులేనని, పెట్రోల్ పోసి నడపడానికి వారేమీ యంత్రాలు కాదని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి ముందు ఏ జట్టు అయినా తాజాగా ఉండాలని కోరుకుంటుందని, కానీ భారత ఆటగాళ్ల విషయంలో అలా జరగలేదని అన్నారు. ఆటగాళ్లకు ఏమాత్రం వ్యవధి ఇవ్వకుండా బీసీసీఐ, ఐసీసీ షెడ్యూల్ రూపొందించాయని.. క్రికెటర్లు కూడా మానవమాత్రులేనన్న సంగతిని బోర్డులు, అభిమానులు గుర్తించాలని అన్నారు.

టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో జట్టులో మార్పు తీసుకురావాలని నాకు నేనే చెప్పుకున్నాను… నేను అనుకున్న మార్పు తీసుకురాగలిగానని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో టీమిండియా ఎదిగిన తీరు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని అన్నారు. సొంతగడ్డమీద బలమైన జట్లుగా పేరుగాంచిన అన్ని జట్లను విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు వాళ్ల సొంతగడ్డల మీదే ఓడించింది అని తెలిపారు. కోహ్లీ ఎంతో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పాడని.. ముఖ్యంగా టెస్టు క్రికెట్ అత్యుత్తమ రాయబారుల్లో కోహ్లీ ఒకడని అన్నారు. టీమిండియా తదుపరి కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టును మరో మెట్టు పైకి తీసుకెళతాడని భావిస్తున్నట్టు రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

Related Articles

Back to top button