ఇంగ్లండ్ తో భారత జట్టు ఐదో టెస్టు మ్యాచ్ కరోనా భయాల కారణంగా అనుకున్న సమాయానికి జరగలేదు. కోచ్ రవిశాస్త్రి, ఆయన సహాయక బృందానికి కరోనా సోకడంతో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ను నిరవధికంగా వాయిదా వేశారు. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, జూనియర్ ఫిజియో నితిన్ పటేల్ కరోనా బారినపడడంతో టీమిండియా ఐదో టెస్టుకు సరిగా సన్నద్ధం కాలేకపోయింది. రవిశాస్త్రి తదితరులు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లి కరోనా బారినపడ్డారని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలపై కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు స్పందించారు. బ్రిటన్ లో కరోనా ఆంక్షలు ఎత్తివేశారని, దేశంలో అన్నీ తెరుచుకున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి టెస్టు నుంచే ఏదైనా జరిగే అవకాశం ఉందని తన తప్పేమీ లేదన్నట్లుగా వివరించారు. ఇక ఈ పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రతిభ కనబర్చిందని రవిశాస్త్రి వెల్లడించారు. ప్రత్యేకించి కరోనా సంక్షోభ సమయంలోనూ తిరుగులేని ఆటతీరు ప్రదర్శించారని కొనియాడారు.
ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(2021-23) పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌పై 2 విజయాలు సాధించిన భారత్ పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి 26 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరింది. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా అందులో 2 మ్యాచ్‌ల్లో గెలుపు, ఓ మ్యాచ్‌లో ఓటమి, మరో మ్యాచ్ డ్రా చేసుకుకోవడం ద్వారా 54.17 విజయాల శాతం నమోదు చేసింది. ఆగస్ట్‌లో జరిగిన విండీస్ పర్యటనలో ఒక టెస్ట్‌ను కోల్పోయి మరో మ్యాచ్‌లో గెలుపొందిన పాక్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. విండీస్ కూడా ఇదే గణాంకాలు నమోదు చేసి పాక్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ జట్టు 14 పాయింట్లు ఖాతాలో వేసుకుని 29.17 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీలో భాగంగా పాయింట్లను కాకుండా విజయాల శాతాన్ని పరిగణలోకి తీసుకుని ర్యాంక్‌ల కేటాయింపు జరుగుతుంది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య సిరీస్‌లో ఐదో టెస్ట్ రద్దు కావడంతో పాయింట్ల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. ఈ సిరీస్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, ఇంగ్లండ్ జట్లకు చెరి రెండు పాయింట్లు కోత విధించిన సంగతి తెలిసిందే..!