మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని చెప్పిన ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా జైలు పాలయ్యారు. వారిని వేర్వేరు జైళ్లకు తరలించారు. కోర్టు వారిద్దరినీ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపింది. పోలీసులు వారిపై ఏకంగా దేశద్రోహం కేసు కూడా నమోదు చేశారు. ముంబై కోర్టు ఆదివారం ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను మే 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తామని బెదిరింపులకు పాల్పడినందుకు “వివిధ సమూహాల మధ్య శత్రుత్వం సృష్టించడం” అనే ఆరోపణపై ఆ జంటను శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. ముంబై పోలీసుల కస్టడీ డిమాండ్‌ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హాలిడే అండ్ సండే కోర్టు, బాంద్రా తిరస్కరించింది. వీరి బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 29న విచారణకు రానుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని సవాల్ చేసినందుకు ఎంపీ-ఎమ్మెల్యే దంపతులపై దేశద్రోహ అభియోగం మోపారు. అయితే “తమపై తప్పుడు నేరం మోపారు’’ అని కోర్టు ఆదేశాల తర్వాత.. జైలుకు తరలిస్తుండగా ఎమ్మెల్యే రవి రాణా మీడియా ప్రతినిధులతో అన్నారు. అంతకు ముందు శివసేన కార్యకర్తలు ఎంపీ నవనీత్ రానా దంపతుల ఇళ్ల ముందు భారీగా రచ్చ చేశారు.
ఈ నెల ప్రారంభంలో, హనుమాన్ జయంతి రోజున తన నివాసంలో శివసేన అధినేత థాకరే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని రవి రాణా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అలా చేయకపోతే, తాను మాతోశ్రీకి వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తానని ప్రకటించారు. శనివారం నాడు మాతోశ్రీకి వెళతామని మొదట వారు ప్రకటించారు.. అయితే ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా రానా దంపతులు తమ ప్రణాళికను రద్దు చేసుకున్నారు.
అయితే వారిపై ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. పోలీసులు ఆ జంటను అరెస్టు చేశారు. అనంతరం వారిని శాంతా క్రజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, అక్కడే రాత్రి పూట ఉంచారు. రానాలపై భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 153 (A) (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడడం) మరియు సెక్షన్ 135 ముంబై పోలీసు చట్టం (పోలీసుల నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన) కింద కేసు నమోదు చేయబడింది. తర్వాత పోలీసులు వీరిద్దరిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో IPC సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) కూడా జోడించారు.