More

    భారత రెజ్లర్ ను కొరికేశాడు.. అయినా కూడా..!

    టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ సెమీ ఫైనల్స్‌లో 57 కేజీల బరువు విభాగంలో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన పురుషుల ఫ్రీస్టైల్ 57 కిలోల విభాగంలో సెమీ ఫైనల్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన సానాయేవ్ నూరిస్లామ్‌ని ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఓ దశలో రవికుమార్ 2-9తో వెనుకబడి ఉండగా మ్యాచ్ ముగిసేందుకు 30 సెకన్ల సమయం మాత్రమే మిగిలుంది. అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ గెలవలేని స్థితిలో రవికుమార్ తన ప్రత్యర్థి నూర్లిసామ్ సనయేవ్ ను దొరకబచ్చుకుని ఫాలౌట్ చేశాడు. దాంతో మ్యాచ్ లో విజయంతో పాటు పతకం కూడా ఖాయమైంది. రవికుమార్ ఫైనల్లో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన ఉగుయేవ్ తో తలపడనున్నాడు. ఫైనల్‌లో కూడా గెలిచి రవి దేశానికి బంగారు పతకం తీసుకుని రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి కుమార్ దహియా నిలిచాడు. సెమీ ఫైనల్ సమయంలో రవి దహియా ధైర్యం, నిబద్ధత అందరికీ కనిపించింది. వెనుకంజలో ఉన్నప్పటికీ విజయాన్ని సాధించాలనే కృతనిశ్చయాన్ని ప్రదర్శించాడు. చారిత్రాత్మక విజయాన్ని చేరుకోవడానికి దహియా ప్రత్యర్థి కొరుకుతున్నా భరించాల్సి వచ్చింది. సెమీ ఫైనల్స్ మ్యాచ్ చివరి కొన్ని సెకన్లలో, రవి దహియా సానాయేవ్ నూరిస్లామ్‌ ను పిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కజకిస్తాన్ రెజ్లర్ అతని కుడి చేతిని తీవ్రంగా కొరికాడు.

    ఈ షాకింగ్ చర్య కెమెరాలో రికార్డ్ చేయబడింది, ఇది తరువాత ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ప్రత్యర్థి కొరుకుతున్నా కూడా తన పట్టును రవి కుమార్ దహియా విడిచిపెట్టలేదు. ‘బై ఫాల్‌’ కాకుండా ఉండేందుకు కజకిస్తాన్‌ రెజ్లర్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. తన మెడను రవి గట్టిగా పట్టుకోవడంతో ఆ పట్టు నుంచి వదిలించుకునేందుకు సానాయేవ్ రవి చేతిని కొరికాడు. అయినప్పటికీ రవి నొప్పిని భరిస్తూనే సానాయేవ్ ను ఓడించాడు. రవి దహియా నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ విజయవంతంగా చివరి నిమిషంలో విజయాన్ని అందుకున్నాడు. ఇది భారత రెజ్లింగ్ చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణమని భారత అభిమానులు చెప్పుకొచ్చారు. “గతంలో సనయేవ్‌ను రెండుసార్లు ఓడించాను. దాంతో భారీ ఆధిక్యంతో వెనుకబడినా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నా. సనయేవ్‌కు నేను ఎక్కువ పాయింట్లు ఇవ్వాల్సింది కాదు. ఇంకా నా పని పూర్తి కాలేదు. నేను స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే టోక్యోకు వచ్చాను. స్వర్ణం గెలిస్తేనే నా లక్ష్యం నెరవేరుతుంది.” అని రవి దహియా చెప్పుకొచ్చాడు.

    Trending Stories

    Related Stories