More

    శివుడికి జలాభిషేకం నిర్వహించిన ఒలింపిక్ మెడలిస్ట్ రవి దహియా

    రవి దహియా.. టోక్యో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో భారత్ కు పతకాన్ని అందించాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌ చేతిలో 7-4 తేడాతో ఫైనల్ లో ఓడిపోయాడు. అతడికి రజత పతకం దక్కింది. అతడికి భారత్ లో ఘన స్వాగతం లభించింది. ఇక రవి దహియా.. తన మొక్కులను చెల్లించుకునే పనిలో ఉన్నాడు.

    రెజ్లర్ రవి దహియా ఇంటికి చేరుకున్న తర్వాత ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో సమయాన్ని వెచ్చిస్తూ వస్తున్నాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే కోరికను నెరవేర్చినందుకు దహియా కుటుంబం అతని ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగించింది. టోక్యో ఒలింపిక్స్ 2020 లో రజతం గెలిచిన తర్వాత దహియా స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, అతను పూజలు చేసి ఒక దేవాలయంలో శివలింగానికి ‘జలాభిషేకం’ నిర్వహించాడు.

    ఈ చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రవి దహియాను నెటిజన్లు ‘నిజ జీవితంలో బాహుబలి’ అని ప్రశంసిస్తూ ఉన్నారు. 2020 లో రవి దహియా, దీపక్ పూనియా మరికొందరు కలిసి ఉత్తరాఖండ్‌లోని తుంగనాథ్‌లోని ప్రపంచంలోని అత్యున్నత శివాలయానికి ట్రెక్కింగ్ చేశారు.

    జమ్మూను సందర్శించిన రవి దహియా

    తనకు రెజ్లింగ్ పట్ల ఇష్టం కలిగేలా చేసిన విక్రాంత్ మహాజన్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి రవి దహియా సోమవారం జమ్మూ చేరుకున్నాడు. “దేశం కోసం ఈ అసమానమైన ఘనతను సాధించడానికి, జమ్మూకు చెందిన విక్రాంత్ మహాజన్ నన్ను ప్రేరేపించారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు” అని దహియా చెప్పుకొచ్చాడు. టోక్యో క్రీడల కోసం భారతీయ అథ్లెట్లను ప్రోత్సహించడానికి ‘గోఅథ్లెట్ ప్రోగ్రామ్’ అనే క్యాంపెయిన్ ప్రారంభించినప్పుడు దహియా కొన్ని సంవత్సరాల క్రితం మహాజన్‌ కు పరిచయం అయ్యాడు. “మొదట్లో నా లక్ష్యం కేవలం ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే, కానీ విక్రాంత్ నన్ను పతకం కోసం పోరాడమని ప్రేరేపించాడు. దానికి మాత్రమే కట్టుబడి ఉండమని నన్ను కోరాడు” అని దహియా తన గురువు గురించి తెలిపాడు. మేమిద్దరం కలిసి రాబోయే 10 సంవత్సరాల కోసం ఒక విజన్ రూపొందించాము. ఇది ప్రారంభం మాత్రమేనని దహియా తెలిపాడు.

    Trending Stories

    Related Stories