భారత్ కు మరో పతకం గ్యారెంటీ.. గోల్డ్ లేదా సిల్వర్ తీసుకుని రానున్న రవి దహియా

0
964

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం గ్యారెంటీ అయింది. టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ సెమీ ఫైనల్స్‌లో 57 కేజీల బరువు విభాగంలో విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. బుధవారం జరిగిన పురుషుల ఫ్రీస్టైల్ 57 కిలోల విభాగంలో సెమీ ఫైనల్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన సానాయేవ్ నూరిస్లామ్‌ని ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఓ దశలో రవికుమార్ 2-9తో వెనుకబడి ఉండగా మ్యాచ్ ముగిసేందుకు 30 సెకన్ల సమయం మాత్రమే మిగిలుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ గెలవలేని స్థితిలో రవికుమార్ తన ప్రత్యర్థి నూర్లిసామ్ సనయేవ్ ను దొరకబచ్చుకుని ఉడుం పట్టు పట్టాడు. తద్వారా ప్రత్యర్థిని ఫాలౌట్ చేశాడు. దాంతో మ్యాచ్ లో విజయంతో పాటు పతకం కూడా ఖాయమైంది.రవికుమార్ ఫైనల్లో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన ఉగుయేవ్ తో తలపడనున్నాడు.

ఫైనల్‌లో కూడా గెలిచి రవి దేశానికి బంగారు పతకం తీసుకుని రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. 57 కేజీల పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో బల్గేరియా ఆటగాడు జియోర్గి వంగెలోవ్‌ను 4-14 తేడాతో ఓడించి భారత స్టార్ రెజ్లర్ రవి దహియా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. సెమీస్ లో చరిత్రను తిరగరాస్తూ రవికుమార్ ఫైనల్‌కు చేరాడు.

రెజ్ల‌ర్ దీపక్ పూనియా సెమీస్‌లో ఓడిపోయాడు. 86కేజీల ఈవెంట్‌లో అమెరికా రెజ్ల‌ర్ డేవిడ్ మోరిస్ టేల‌ర్ చేతిలో దీప‌క్ ఓటమి పాలయ్యాడు. టెక్నిక‌ల్ సుపీరియార్టీ ప‌ద్ధ‌తిలో టేల‌ర్ 10-0 స్కోర్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆరంభం నుంచి అమెరికా రెజ్ల‌ర్ టేల‌ర్ దూకుడుగా ఆడాడు. దీప‌క్‌ను ఓ ప‌ట్టుప‌ట్టేశాడ‌త‌ను. మ‌రింత యాక్టివ్‌గా కావాల‌టూ దీప‌క్‌ను రెఫ‌రీ కోరాడు. ఆ స‌మ‌యంలో ఇన్‌యాక్టివ్ క్లాక్‌తో పాయింట్ల‌ను దీప‌క్ కోల్పోయాడు. రెజ్ల‌ర్ దీప‌క్‌ బ్రాంజ్ మెడ‌ల్ కోసం మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

2008, 2012, 2016 ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో భారత్‌కు రెజ్లింగ్‌లో పతకాలు దక్కాయి. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ కుమార్‌కు కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ లో సుశీల్‌కు రజతం, యోగేశ్వర్‌కు కాంస్యం, 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్‌ కాంస్య పతకం దక్కింది. ఇక ఇప్పటికే రవి దహియాకు గోల్డ్ లేదా సిల్వర్ కన్ఫర్మ్ అవ్వగా.. రెజ్ల‌ర్ దీప‌క్‌ బ్రాంజ్ మెడ‌ల్ తీసుకుని వస్తాడని అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు.

పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీకి చెందిన జె.వెట్టర్ (85.64 మీ), ఫిన్లాండ్‌కు చెందిన ఎల్.ఎటెలాటలో (84.50 మీ) నిలిచారు. ఈ నెల 7న జావెలిన్ త్రో ఫైనల్ జరగుతుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here