ముంబైలో దారుణం చోటు చేసుకుంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) నడుపుతున్న ఆసుపత్రిలో ఎలుకలు కరవడం వలన ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఎలుకలు ఐసీయూలోని రోగి కళ్ళను కరిచాయి. ఆ రోగి ఐసీయూలో మరణించారు. రోగి కాలేయ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అతను ఐసియులో ఉండగా ఎలుక అతని కళ్ళ మీద కరిచింది. ఎలుకలు కొరకడంతో అతనికి గాయాలు అయ్యాయని బిఎంసి అధికారులు పేర్కొన్నారు.

కుర్లా కమానీ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఎల్లప్ప అనే వ్యక్తి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు రెండు రోజుల కిందట రాజావాడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడువాపు, కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పి ఐసీయూలో ఉంచారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్ కంటి కింది భాగంలో గాయాలు అయ్యాయి.. రక్తం కూడా కారడం మొదలైంది. ఈ విషయం రోగి బంధువులకు తెలియడంతో వారు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. ఎలుక కరవడంతో గాయం అయ్యిందని, దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. కానీఈ ఘటన చోటు చేసుకున్న 24 గంటల్లోనే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. నిరసన కార్యక్రామాలను చేపడుతోంది. బిఎంసిలో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం అయ్యాయని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ వెంటనే ఆస్పత్రికి వెళ్లి వార్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. నాలుగేళ్ల క్రితం కాందివలిలోని శతాబ్ధి ఆస్పత్రిలో కూడా ఇలాగే ఓ రోగి ముఖాన్ని ఎలుకలు కొరికేశాయి. మార్చురీలో ఎలుకలు శవాలను గుర్తుపట్టలేనంతగా కొరిన సంఘటనలు ఉన్నాయి. అయినా బిఎంసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పు రావడం లేదు. ఆసుపత్రులలో అవసరమైన పరిశుభ్రత పాటించటానికి వెనుకాడే బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పబ్లిసిటీకి మాత్రం పెద్దగా ఖర్చు చేస్తోంది. పిఆర్ మరియు ఇమేజ్ బూస్టింగ్ కోసం సోషల్ మీడియా హ్యాండిల్స్ నిర్వహణ కోసం ఏటా రూ .2 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. దీంతో బిఎంసి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి.
