2023లో భారత్ లో ప్రపంచ కప్ నిర్వహించాల్సి ఉంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్‌లో ఆసియా కప్ జరగనుంది. పాక్ లో జరిగే ఆ టోర్నమెంట్ లో భారత్ పాల్గొనదని భారత్ ఇప్పటికే స్పష్టంగా చెప్పేసింది. తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్ లో భారత ఆటగాళ్లకు రక్షణ ఉండదని ఇప్పటికే వాదనలు వినిపించాయి. అంతేకాకుండా భారత్ లేకుండా టోర్నమెంట్ నిర్వహించడంలో కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని అందరికీ తెలుసు. అయితే పాక్ మాత్రం మేకపోతు గాంభీర్యానికి పోతోంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా మరోసారి మాట్లాడుతూ ఆ టోర్నీలో ఆడేందుకు భారత జట్టు రాకుంటే భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ కోసం పాక్ వెల్లబోదని చెప్పారు. పాకిస్థాన్ గత రెండు సంవత్సరాలుగా నాణ్యమైన క్రికెట్ ఆడుతోందని.. 2021 ప్రపంచకప్, ఈ ఏడాది జరిగిన ఆసియా కప్‌లలో భారత్‌ను పాకిస్థాన్ రెండు సార్లు ఓడించిందని అన్నారు. భారత జట్టు ఆసియాకప్ కోసం పాకిస్థాన్ వస్తే, అప్పుడు తాము ప్రపంచకప్ కోసం భారత్ వస్తామని, ఈ విషయంలో తమ వైఖరి స్పష్టమని రమీజ్ అంటున్నాడు. పాకిస్థాన్ లేని ప్రపంచకప్‌ను ఎవరు చూస్తారని ప్రశ్నించాడు. పాకిస్థాన్ క్రికెట్‌ను ఆర్థికంగా మెరుగుపరచాలని భావిస్తున్నామని, తమ జట్టు అద్భుతంగా ఆడినప్పుడే అది సాధ్యమవుతుందని అన్నాడు.