పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త ఛైర్మన్ గా రమీజ్ రాజాను నియమించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేకంగా రమీజ్ రాజాని పీసీబీ ఛైర్మన్‌గా నియమించాడు. సోమవారం రమీజ్ రాజా బాధ్యతలు చేపట్టాడు. వచ్చీ రాగానే రమీజ్ రాజా క్రికెటర్ల జీతాలను భారీగా పెంచేశారు. ఏకంగా 250 శాతం మేర వారి జీతాలు పెరగడం విశేషం. పాకిస్తాన్ లోని గ్రూప్ డీ ప్లేయర్స్ ఇన్నాళ్లూ నెలకు 40 వేల పాకిస్థాన్ రూపాయలను (మన కరెన్సీలో రూ.17 వేలు) అందుకునే వారు. కానీ ఇప్పుడు వారి జీతాలు లక్ష పెరిగి లక్షా 40 వేల పాక్ రూపాయలకు చేరింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని రజా చెప్పారు. 192 మంది దేశవాళీ క్రికెటర్లు ఈ నిర్ణయం కారణంగా లబ్ది పొందనున్నారు. ఓ వైపు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉండగా.. ఇప్పుడు రమీజ్ రాజా ఏకంగా భారీగా జీతాలను పెంచేశారు జాతీయ జట్టులోని గ్రేడ్ ఎ ప్లేయర్స్ జీతాలు రూ.13.75 లక్షల నుంచి రూ.14.75 లక్షలకు చేరగా.. గ్రేడ్ బి ప్లేయర్స్ 9.37 లక్షలకు బదులుగా 10.37 లక్షలు, గ్రేడ్ సీ ప్లేయర్స్ 6.87 లక్షలకు బదులుగా 7.87 లక్షలు అందుకోనున్నారు. టీమ్‌లో స్థానం కోసం ఎవరూ ఆందోళన చెందవద్దని, స్వేచ్ఛగా ఆడాలని కొత్త పీసీబీ చీఫ్ రమీజ్ రజా పిలుపునిచ్చారు.
భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఇప్పట్లో జరగడం అసాధ్యమని రమీజ్ రాజా స్పష్టం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ గురించి మీడియా అడగ్గా ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఇప్పట్లో అసాధ్యం. క్రీడల్లోకి రాజకీయాల్ని తీసుకొచ్చి నాశనం చేశారు. మేము కూడా ఆ ద్వైపాక్షిక సిరీస్ కోసం తొందరపడటం లేదు. పీసీబీ ఫస్ట్ ఫోకస్ దేశవాళీ, స్థానిక క్రికెట్‌పైనే. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చాలా అంశాల్ని పరిశీలించి నాకు ఈ బాధ్యతని అప్పగించారు. ఇది నాకు పెద్ద ఛాలెంజ్’’ అని రమీజ్ రాజా చెప్పుకొచ్చారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పైనా రజా స్పందించారు. ఈ మ్యాచ్ కోసం పాక్ 100 శాతం సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌లో భారత్‌పై కనీసం ఒక్కసారి కూడా పాక్ గెలుపొందలేదు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. పాక్ జట్టు మొదటి మ్యాచ్‌లోనే భారత్‌తో అక్టోబరు 24న తలపడనుంది.