బీసీసీఐతో మాట్లాడుతా.. భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించకూడదంటున్న కేంద్ర మంత్రి

0
664

కేంద్రమంత్రి రాందాస్ అథవాలే టీ20 ప్రపంచ కప్ లో భాగమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ను నిర్వహించకూడదని పిలుపును ఇచ్చారు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ తో పాకిస్తాన్ తలపడనుంది. భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ మ్యాచ్ అక్టోబరు 24న జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఈ మ్యాచ్ ను నిర్వహించకూడదని అంటున్నారు. ఇప్పటికే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వలస కూలీల హత్యలు జరుగుతున్న క్రమంలో భారత్‌, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదని అథవాలే అన్నారు. పాకిస్తాన్‌ ఎలాంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు. భారత దేశంపై వారి ఉగ్రచర్యలు ఆగడంలేదు. కశ్మీర్‌ లోయలో పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయకపోతే, భారత్‌ ఆదేశం పై యుద్దం ప్రకటించాలని ఆయన పిలుపును ఇచ్చారు. కశ్మీర్ లోయలో అభివృద్ధి జరగకూడదని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న సమయంలో భారత్‌.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదని అథవాలే చెప్పారు. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షాతో చర్చిస్తానని అథవాలే తెలిపారు.

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ ను నిర్వహించకూడదని అన్నారు. క‌శ్మీర్‌లో తాజాగా జ‌రిగిన ఉగ్ర‌వాద దాడుల్లో 9 మంది భార‌త జ‌వాన్లు మ‌ర‌ణించార‌ని.. ఒక‌వైపు సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మ‌రో వైపు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా ఎలా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతుంద‌ని అస‌ద్ ప్ర‌శ్నించారు. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకుండా టీమిండియా బాయ్ కట్ చేయాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దాయాదుల పోరు జరగడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే ఆస్కారముందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్-పాక్ మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవని.. కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌పై పునరాలోచన చేయాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్ అయింది.