షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో రోజుకొక విషయం బయటకు వస్తూ ఉంది. షారుఖ్ ఖాన్ పేరెంటింగ్ గురించి కూడా పలువురు నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. షారుఖ్ ఖాన్‌కు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే కీలక సూచన చేశారు. ఆర్యన్ ఖాన్‌ను పునరావాస కేంద్రానికి పంపాలని రాందాస్ అథవాలే సూచించారు.‘‘చిన్న వయసులో డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదు. ఆర్యన్ ఖాన్‌కు భవిష్యత్తు ఉంది. ఆర్యన్ ఖాన్‌ను మినిస్ట్రీకి సంబంధించిన డి-అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కి పంపమని నేను షారుఖ్ ఖాన్‌కు సలహా ఇస్తున్నానని తెలిపారు. అతను 1-2 నెలలు అక్కడ ఉండాలి.. అతడిని జైల్లో ఉంచకుండా, దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు చాలానే ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా ఒకటి రెండు నెలల్లో డ్రగ్స్ వ్యసనం నుంచి విముక్తి పొందుతాడని మంత్రి రాందాస్ తెలిపారు.
ఇక చిన్న మొత్తంలో డ్రగ్స్ పట్టుబడే అంశంపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. వ్యక్తిగత అవసరాల కోసం చాలా తక్కువ మొత్తంలో డ్రగ్స్ కలిగి ఉండటం నేరం కాదని.. నిందితులను జైలుకు పంపనవసరం లేదని తెలిపింది. గతవారం నార్కొటిక్ చట్టం(ఎన్‌డీపీఎస్)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొని రెవెన్యూ విభాగానికి సిఫారసు చేసింది. డ్రగ్స్ వాడేవారికి ప్రభుత్వ కేంద్రాల్లో తప్పనిసరిగా వైద్యం అందించాలని సూచించింది. పరిమాణంతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి డ్రగ్స్ కలిగి ఉండటం అనేది ఎన్‌డీపీఎస్ చట్టం సెక్షన్ 27 కింద క్రిమినల్ నేరం. శిక్ష కింద ఏడాది జైలు/రూ.20వేల జరిమానా/రెండూ విధించవచ్చు.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం ముంబయి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. జైలులోని తన గదిలో ఆర్యన్ ఖాన్ పుస్తకాలు చదువుతున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ జైలు గదిలో రెండు పుస్తకాలు ఉండగా, వాటిలో ఒకటి ఫిక్షన్ నవల కాగా, రెండోది రామాయణ గ్రంథం! తనకు చదువుకోవడానికి పుస్తకాలు కావాలని ఆర్యన్ జైలు అధికారులను కోరగా, జైలులో ఉన్న గ్రంథాలయం నుంచి అధికారులు రెండు పుస్తకాలు తీసుకువచ్చి ఆర్యన్ కు అందించారని తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఆర్యన్ ఖాన్ ను అధికారులు ఇతర సాధారణ ఖైదీలతో కలవనివ్వడంలేదని తెలుస్తోంది.