రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఆరెంజ్. ఈ సినిమాకు కొణిదెల నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. 2010లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత సినిమా చాలా బాగుందని, ఎందుకు ప్లాప్ అయ్యిందో అనే కామెంట్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఆదరణకు నోచుకుంటూ ఉన్నాయి. ఈ సినిమా రీరిలీజ్ ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా.. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా సినిమాను విడుదల చేస్తున్నట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 25, 26 తేదీల్లో మళ్లీ విడుదల చేస్తున్నామని… ఆ సినిమా ద్వారా రాబోయే ప్రతి రూపాయిని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్టు నాగబాబు ప్రకటించారు. మెగా అభిమానులు, జనసైనికులు తమ వంతుగా ఈ కార్యక్రమంలో భాగం అయి, వినోదంతో పాటు జనసేనను బలోపేతం చేసే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. అప్పట్లో ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ నుంచి వచ్చిన ఈ లవ్ స్టోరీని ప్రజలు ఆదరించలేదు. బొమ్మరిల్లు భాస్కర్ ఓ క్లాసిక్ ను తీస్తే పట్టించుకోలేదు. ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ద్వారా గ్లోబల్ ఐకాన్ గా మారడంతో ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.