బీహార్ లోని దక్షిణ చంపారన్ లోని బెట్టియా ప్రాంతంలో హిందూ దేవాలయంలోని విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆలయాన్ని కొందరు అపవిత్రం చేశారని తెలిసి పెద్ద ఎత్తున ఆగ్రహం చెలరేగింది. బస్వేరియా ధునియపట్టిలో ఉన్న రామ్ జానకి ఆలయం లోపల ఉన్న విగ్రహాలను ఉదయం సమయంలో కొందరు ధ్వంసం చేయడంతో ప్రజలలో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి.
ఆలయం ధ్వంసం చేశారని, దేవుళ్ల విగ్రహాలను పెకిలించి వేశారనే కోపంతో ఉన్న ప్రజలు వీధుల్లోకి వచ్చి ఈ సంఘటనపై ఆందోళన నిర్వహించారు. పీపల్ చౌక్ సమీపంలో ఉన్న బెట్టియా-నౌటన్ రహదారిపై వాహనాలను అడ్డుకున్నారు. టైర్లను దగ్ధం చేసి రాకపోకలు జరగకుండా అడ్డుకున్నారు. ఆలయ విధ్వంసానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఆలయ పూజారి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి.. ఉద్దేశపూర్వకంగా కొందరు చేసిన కుట్ర అని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. పోలీసులు ఇలాంటి ఘటనలను పెద్దగా పట్టించుకోవడం లేదని.. అనేక మంది జూదగాళ్ళు, మద్యపాన బానిసలు ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటారని. ఇప్పటికే చాలా సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు.
విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయని ఎస్‌డిపిఓ ముకుల్ పరిమల్ పాండే తెలిపారు. ఆలయ పూజారి ఆలయాన్ని శుభ్రం చేయడానికి ఉదయం తలుపులు తెరిచినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో విగ్రహాలు దెబ్బతినలేదని.. శుభ్రం చేసిన తరువాత, పూజారి స్నానం చేయడానికి వెళ్ళాడని.. అతను తిరిగి వచ్చినప్పుడు, విగ్రహాలు పగిలిపోయి ఉండడం చూశాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఉదయం 5:30 గంటలకు జరిగి ఉండవచ్చునని పూజారి మీడియాకు తెలిపారు.
ఈ సంఘటన గురించి సమాచారం అందగానే.. పోలీసులు త్వరగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉద్రిక్తతలను సద్దుమణిగించడానికి ప్రయత్నించారు. హిందూ దేవాలయంపై దాడి చేసి.. ఆలయంలోని విగ్రహాలను దుండగులు నాశనం చేశారని ఆ ప్రాంతంలోని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైకి వచ్చిన స్థానికులు 3 గంటలకు పైగా రహదారిని దిగ్భందించారు. రాబోయే 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని సీనియర్ పోలీసు అధికారులు హామీ ఇచ్చిన తరువాత ప్రజలు తమ ఆందోళనను విరమించారు.