సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు ఒక జత నాగుపాములకు తిలకం దిద్ది.. రాఖీ కట్టడం కనిపించింది. కానీ ఈ ఘటన విషాదాంతం అయ్యింది. రక్షాబంధన్ రోజున పాములకు రాఖీ కట్టాలనుకున్న ఓ వ్యక్తి.. ఆ పాము కాటుకే బలయ్యాడు. బీహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల మన్మోహన్ అనే యువకుడు కాటుకు గురైన వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ పాము విషానికి ప్రాణాలను కోల్పోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, మన్మోహన్ రెండు పాములను తోకలతో పట్టుకుని కనిపించాడు. అవి కింద పారాడుతూ కనిపించాయి. మొదట అతడు పాములకు తిలకం పెట్టాడు. రాఖీ ప్లేట్ నుండి ఏదో తీసుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ పాము ఆ వ్యక్తి పాదాలపై కాటు వేయడాన్ని గమనించవచ్చు.
వృత్తిరీత్యా మన్మోహన్ పాములు పట్టేవాడే. అయితే ఆ రోజున రెండు పాములను ఇంటికి తెచ్చిన అతను.. తన సోదరీమణులతో వాటికి రాఖీ కట్టించే ప్రయత్నం చేశాడు. రాఖీ కట్టడానికి ముందు ఆ సర్పాలకు తిలకం దిద్దాలనుకున్నాడు. పాము తోకలను పట్టుకున్న అతను ఆ సమయంలో తిలకం అందుకునే ప్రయత్నం చేశాడు. అతని చేతుల్లో ఉన్న ఓ పాము మన్మోహన్ ఎడమ కాలి బొటనవేలను కొరికేసింది. పాముకు రాఖీ కట్టే వేడుకను చూసేందుకు వచ్చిన జనం వీడియోలను తీశారు. ఆ పాము కొరికిన వెంటనే మన్మోహన్ తన పాదాలను పరిశీలించి, తిరిగి తన పని తాను చేసుకున్నాడు. కానీ కొద్దిసేపటికే విషం అతడిపై ప్రభావం చూపించడం మొదలైంది. అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
25 ఏళ్ల మన్మోహన్ దశాబ్ద కాలంగా పాములను పట్టుకోవడం.. వాటికి అయిన గాయాలకు పైగా చికిత్స అందించడం వంటివి చేస్తుండేవాడు. తన గ్రామంలో పాముకాటుతో బాధపడుతున్న వ్యక్తులకు మన్మోహన్ చికిత్స చేసేవాడు, కానీ దురదృష్టవశాత్తూ అదే పాము కాటుకు ప్రాణాలను కోల్పోయాడు.