కరోనా సమయంలో కూడా ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా నియమనిబంధనలను పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు. అతి తక్కువ మంది మాత్రమే హాజరు కావాలని అధికారులు చెబుతూ ఉన్నారు. దీంతో తక్కువ మంది సమక్షంలోనే పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు. ఓ జంట మాత్రం చాలా తెలివిగా ఆలోచించి విమానాన్ని అద్దెకు తీసుకుని మరీ పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లిలో కరోనా మార్గదర్శకాలు కనిపించకపోవడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అయితే పెళ్లిళ్లు 50 మందిని మించకుండా చేసుకోడానికి వీలు లేదు.. అదే విమానంను అద్దెకు తీసుకుంటే విమానంలోని అన్ని సీట్లలోనూ బంధువులను కూర్చో పెట్టుకోవచ్చని ఆ జంట అనుకుంది. అనుకున్నదే తడవుగా విమానాన్ని అద్దెకు తీసుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో కొందరు మీ తెలివి సూపర్ అని చెప్పగా.. కరోనా సమయంలో అంత మంది విమానంలో అవసరమా అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
మధురైకు చెందిన రాకేష్-దక్షిణలకు పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లికి తక్కువ మందికి మాత్రమే అనుమతులు ఉండడంతో మధురై-బెంగళూరుకు విమానాన్ని బుక్ చేశారు. అలా విమానంలో 161 సీట్లలో బంధువులు కూర్చుని ఉండగా.. పెళ్లి తంతు జరిగింది. ఆ తర్వాత బెంగళూరు నుండి మధురైకు అదే విమానంలో తిరిగి చేరుకుంది ఈ పెళ్లి బృందం..! స్పైస్ జెట్ విమానాన్ని ఈ పెళ్లి బృందం అద్దెకు తీసుకుంది. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 161 సీట్లలో ఉన్న బంధువుల సమక్షంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి కట్టాడు. మధురై మీనాక్షి అమ్మవారి గుడి చుట్టూ కూడా విమానం చక్కర్లు కొట్టింది.
ఈ పెళ్లిలో కరోనా మార్గదర్శకాలు కనిపించలేదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో అతిథులు ఎక్కువగా ఉండగా.. వధూవరులకు మాస్కుల్లేకుండానే కనిపించడాన్ని డీజీసీఏ తప్పుబట్టింది. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్వహించిన ఈ పెళ్లిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. పెళ్లి సమయంలో సిబ్బందిగా ఉన్న స్పైస్ జెట్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్ ను డీజీసీఏ ఆదేశించింది. పెళ్లి కొత్తగా చేసుకోవాలని అనుకున్న వారికి ఇలా డీజీసీఏ షాక్ ఇచ్చింది.