మహారాష్ట్రలో శివసేనకు షాక్.. కోలుకోలేని దెబ్బకొట్టిన బీజేపీ..!

0
768

శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 8 స్థానాలను బీజేపీ దక్కించుకోగా.. ఐదు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, స్వతంత్రులు ఒక్కో సీటును కైవసం చేసుకున్నాయి.

మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను బీజేపీ మూడింటిని గెలుచుకుని అధికార కూటమికి షాకిచ్చింది. క్రాస్ ఓటింగ్‌పై వాగ్వివాదం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో కౌంటింగ్ దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమైంది. గెలుపొందిన బీజేపీ నేతల్లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఉన్నారు. ఇక, మహారాష్ట్రలో అంధికారంలో ఉన్న ఎంవీఏ కూటమి బరిలోకి దింపిన అభ్యర్థుల్లో శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్‌సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్ గర్హి విజయం సాధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ, శివసేన రెండూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి.

కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పోటీ చేసిన మూడు స్థానాలను గెలుచుకుంది. నాలుగు స్థానాలకు గాను బీజేపీ మూడింటిని కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. జేడీఎస్ కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. బీజేపీ నేతల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, నటుడు, రాజకీయ నేత జగ్గేష్, లెహర్ సింగ్ సిరోయా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జైరాం రమేశ్ గెలుపొందారు.

రాజస్థాన్‌లో పోటీ చేసిన నాలుగు స్థానాల్లో మూడింటిలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ ఒక్క స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, బీజేపీకి చెందిన ఘనశ్యామ్ తివారీ రాజ్యసభకు ఎన్నికైనట్టు ఈసీ ప్రకటించింది. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మీడియా అధినేత సుభాష్ చంద్ర ఓటమి పాలయ్యారు.

హర్యానాలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ పోల్ అభ్యర్థి అజయ్ మాకెన్ తగినంత ఓట్లు సాధించడంలో విఫలమై ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత కృషన్‌లాల్ పన్వర్, బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కార్తికేయ శర్మకు క్రాస్ ఓటింగ్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధీకృత పోలింగ్ ఏజెంట్ బీవీ బాత్రా ఆరోపించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here