12 వ్యూహాత్మక రహదారులను ప్రారంభించిన భారత్.. ప్రత్యర్థులకు చెక్

సరిహద్దు ప్రాంతాల విషయంలో భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తోంది. సరిహద్దు దేశాలు తోకజాడిస్తూ ఉన్న సమయంలో సైన్యాన్ని వీలైనంత త్వరగా తీసుకుని వెళ్ళడానికి రోడ్డు మార్గాల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టింది భారత్. తాజాగా భారత్ 12 వ్యూహాత్మక రహదారులను ప్రారంభించింది.
అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం ఉండేలా రహదారి మౌలిక సదుపాయాలు ముఖ్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. గురువారం నాడు ఆయన 12 సరిహద్దు రహదారులను ప్రారంభించారు. ఈ రహదారులు “వ్యూహాత్మక మరియు సామాజిక-ఆర్ధిక ప్రాముఖ్యతను” కలిగి ఉన్నాయని అన్నారు. వీటి ద్వారా జాతీయ భద్రతను బలోపేతం చేయవచ్చని.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన వెల్లడించారు. భారత సైనిక దళాల అవసరాలను తీర్చడంలోనూ.. మందులు, రేషన్ వంటి నిత్యావసరాలను మారుమూల ప్రాంతాలకు రవాణా చేయడానికి ఈ రహదారులు సహాయపడతాయని రాజనాథ్ సింగ్ వెల్లడించారు. రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజ్ నాథ్ సింగ్ గత ఏడాది గాల్వన్ వ్యాలీ ఘర్షణ సందర్భంగా విధుల్లో మరణించిన 20 మంది సైనికులకు నివాళులు అర్పించారు. భారతదేశం శాంతి-ప్రేమగల దేశం అని, అయితే దురాక్రమణకు దాని ప్రతిస్పందన ధీటుగానే ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సరిహద్దు రహదారి ప్రాజెక్టులు భారతదేశం యొక్క ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగమని, ఇందులో భాగంగా సరిహద్దు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు
అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్ 20 కిలోమీటర్ల పొడవైన డబుల్ లేన్ కిమిన్-పోటిన్ రహదారితో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని తొమ్మిది రహదారులను, లడఖ్, జమ్మూ కాశ్మీర్లలో రహదారులను ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) యొక్క ‘అరుణంక్’, ‘వర్తక్’, ‘బ్రాహ్మంక్’, ‘ఉదయక్’, ‘హిమాంక్’, ‘సంపార్క్’ ప్రాజెక్టుల కింద ఈ రహదారులను నిర్మించినట్లు రాజనాథ్ సింగ్ తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ శాఖ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలోని మారుమూల సరిహద్దు ప్రాంతాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) చేసిన కృషిని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ముఖ్యంగా COVID-19 లాక్ డౌన్ సమయంలో కూడా బిఆర్ఓ చాలా కష్టపడి ఈ రోడ్లను పూర్తీ చేసిందని వెల్లడించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం, రక్షణ తయారీలో స్వావలంబన పెంపొందించే చర్యలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (OFB) కార్పొరేటైజేషన్ లాంటి ప్రభుత్వం చేపట్టిన కొన్ని ముఖ్యమైన సంస్కరణలను రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. ఈ సంస్కరణలు వేగంగా మారుతున్న కాలానికి తగ్గట్టుగా గేమ్ ఛేంజింగ్ నిర్ణయాలని ఆయన అన్నారు.