తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కూనూర్ వద్ద ఛాపర్ కూలిన ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి లోక్‌సభ సంతాపం తెలిపింది. సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఈ దుర్ఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారన్నారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారని.. ఆయన్ను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ దంపతులు మృతి చెందారని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఇక బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్‌లో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉందని.. అయితే మధ్యాహ్నం 12.08 గంటలకు సుల్లూరు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని చెప్పారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని.. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లారన్నారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న హెలికాఫ్టర్‌ను వారు చూశారని.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడేందుకు స్థానికులు శాయశక్తుల ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి పార్థివదేహాలను గురువారం సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నట్లు తెలిపారు. శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌మార్షల్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే విచారణ కమిటీ తమ దర్యాప్తు మొదలుపెట్టిందన్నారు.
భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్ కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు ప్రకటించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్ బేస్ క్యాంప్‌కు తరలించారు. వింగ్ కమాండర్ ఆర్ భరద్వాజ్ నేతృత్వంలోని 25 మంది సభ్యుల వైమానిక బృందం బ్లాక్‌బాక్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బ్లాక్‌బాక్స్‌ను వెల్లింగ్టన్ నుంచి ఢిల్లీకి తరలించి, అందులో ఉన్న డేటాను డీకోడ్ చేయనున్నారు. బ్లాక్ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది.