యోగి ఆదిత్యనాథ్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో క్రిమినల్స్ రాజ్యం ఏలేవారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే పోలీసులకు కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసుల వేటలో ఎంతో మంది క్రిమినల్స్ హతమయ్యారు. చాలా మంది సరెండర్ అయి.. జైళ్లలో ఉంటే ప్రాణాలతో ఉండగలమనే ఆలోచనకు వచ్చారు. దీంతో ఉత్తర ప్రదేశ్ లో క్రైమ్ రేట్ భారీగా తగ్గిపోయింది.
తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆదిత్యనాథ్ నిజాయితీపై ఎవరూ సందేహం వ్యక్తం చేయలేరని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో జరిగిన సభలో ప్రసంగించిన సింగ్ ఆదిత్యనాథ్ పేరు వింటేనే నేరస్థులకు వణుకు పుడుతోందని అన్నారు. రాజ్ నాథ్ సింగ్ అవైద్యనాథ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యోగి ఆదిత్యనాథ్ గురువు అయిన మహంత్ అవైద్యనాథ్ 70వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు.
శాంతిభద్రతలు గురించి జనం మాట్లాడుతుంటారని, శాంతిభద్రతలు ఉంటే కానీ ఉత్తరప్రదేశ్ అభివృద్ధి సాధ్యం కాదని, సమర్ధుడైన అడ్మినిస్ట్రేటర్‌గా ముఖ్యమంత్రి మతపరమైన కార్యక్రమాలను కూడా చక్కగా నడిపించారని ఆదిత్యనాథ్ పై ప్రశంసలు కురిపించారు. నేను రామ్ ను చూశాను.. శ్యామ్ ను చూశాను. అందులో సదరు నటుడు ద్విపాత్రాభినయం చేశాడు. యోగి ఆదిత్యనాథ కేవలం ద్విపాత్రాభినయానికే పరిమితం కాలేదు. అనేక పాత్రలు చేశారు, అద్భుతంగా పాత్ర పోషణ చేశారని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. బీజేయేతర ప్రభుత్వాల పాలనలో గూండాలే పోలీసులను శాసించేవారని.. ఈరోజు గూండాలపై పోలీసులదే పైచేయి అయిందని అన్నారు. సంఘ వ్యతిరేక శక్తుల ఆస్తులు సీజ్ అయ్యాయని, బీజేపీ పాలనలో రాష్ట్రంలో సమూల మార్పులు వచ్చాయని చెప్పారు. అవినీతి రహిత పాలనను యోగి సర్కార్ అందించిందని అన్నారు. మహిళల రక్షణ కోసం కూడా ఎన్నో పనులను యోగి సర్కార్ చేపట్టిందని అన్నారు రాజ్ నాథ్ సింగ్.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం వెళ్తోందని, యోగి ఆదిత్యనాథ్ ప్రచార సారథ్యంలో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాపులారీటికి కూడా పార్టీకి తోడవుతుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. భారతదేశం ఇంకెంత మాత్రం బలహీన దేశం కాదని, చాలా బలంగా ఉందని అన్నారు.