ట్రంప్ హయాంలోనే కాదు.. ప్రస్తుతం బైడెన్ జమానాలోనూ భారత, అమెరికా మైత్రి మరింత బలపడుతోంది. ముఖ్యంగా రక్షణరంగంలో ఇరు దేశాలు ఇచ్చిపుచ్చునే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరిస్తామని భారత్, అమెరికా సంయుక్తంగా ప్రకటించాయి. భారత పర్యటనకు వచ్చిన అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జనరల్ లాయిడ్ ఆస్టిన్.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. రక్షణ రంగంలో సహకారం, వర్తమాన అంశాలపై సమాచార మార్పిడి, రక్షణ పరికరాల రవాణాలో పరస్పర తోడ్పాటు వంటి విషయాలపై చర్చించారు. ఈ భేటీలో ఇరు దేశాల రక్షణ మంత్రులతో పాటు.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. రాజ్ నాథ్ తొ భేటీకి ముందు ఢిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు ఆస్టిన్ నివాళులు అర్పించారు. అనంతరం విజ్ఞాన్ భవన్ లొ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.
రెండు దేశాల సంయుక్త సైనిక కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా చర్చలు జరిగాయని రాజ్ నాథ్ చెప్పారు. లాయిడ్ ఆస్టిన్, ఆయన అధికార బృందంతో చర్చలు ఫలవంతంగా సాగాయన్నారు. సమగ్రమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠపరిచేందుకు కట్టుబడి స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఆఫ్రికా కమాండ్ తో కలిసి పనిచేస్తామన్నారు. ఇరువురి నేతల మధ్య ఎల్ఈఎంఓఏ, కామ్కాసా, బెకా ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రాజ్ నాథ్ తెలిపారు. రక్షణ సంబంధాల బలోపేతానికి మరింత ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. సైనిక విస్తరణ, సమాచార మార్పిడి, రవాణాలో పరస్పర సహకారం అందించాలని నిర్ణయించినట్లు రాజ్ నాథ్ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, గత వారం మిగ్ 21 బైసన్ యుద్ధ విమాన ప్రమాదంలో చనిపోయిన భారత వైమానిక దళ కెప్టెన్ ఆశిష్ గుప్తాకు ఆస్టిన్ నివాళులర్పించారు. దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సైన్యం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నదో ఆశిష్ మరణం గుర్తు చేస్తూనే ఉంటుందని అన్నారు. మిత్ర దేశాలు, భాగస్వాముల పట్ల బైడెన్ ప్రభుత్వ వైఖరి ఏంటో రాజ్ నాథ్ కు వివరించానని ఆస్టిన్ తెలిపారు. భారత్–అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలపడాలన్నదే బైడెన్ ప్రభుత్వ ప్రాధాన్యత అని.. దానిపైనే రాజ్ నాథ్ తో చర్చించినట్టు తెలిపారు. రక్షణ వాణిజ్యం, ప్రాంతీయ భద్రతలో సహకారం, సైనిక కార్యకలాపాలపై కూలంకషంగా చర్చించినట్టు ఆస్టిస్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు పోషిస్తున్న పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రశంసించారు.
అంతకుముందు లాయిడ్ ఆస్టిన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన సవాళ్లపై రెండు దేశాలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయని ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు.
అంతేకాదు, అంతకుముందు రోజు సాయంత్రం ఆస్టిన్ ప్రధాని మోదీతోనూ సమావేశమయ్యారు. ఇరువురి భేటీ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాల్సిన అవశ్యకత ఉందని తెలిపారు.