ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో నల్ల బెలూన్లు.. లొంగిపోయిన రాజీవ్ రతన్

0
787

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనను వ్యతిరేకిస్తూ నలుపు రంగు బెలూన్లు ఎగురవేసిన రాజీవ్ రతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గురువారం గన్నవరం పోలీస్ స్టేషన్‌ వచ్చి చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్నారు.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయన హెలికాఫ్టర్‌లో వెళ్తున్న సమయంలో కొందరు నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. దీంతో ఈ వ్యవహారంపై విమర్శలు మొదలయ్యాయి. ప్రధాని భద్రతకు ముప్పు కలిగించేలా నల్ల బెలూన్లు వదిలారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాజీవ్ రతన్ లొంగిపోవడం ఆసక్తిని రేపుతోంది.

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి భీమవరంకు మోదీ, జగన్ వెళ్తుండగా కాంగ్రెస్ శ్రేణులు డజన్ల కొద్ది ఎయిర్ బెలూన్లను గాల్లోకి వదిలాయి. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో బెలూన్లను యువకులు వదిలారు. బెలూన్లను ఎగురవేసిన ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, కొన్ని దుష్టశక్తులు బెలూన్లను ఎగురవేశాయని మండిపడ్డారు. నల్ల బెలూన్లను గాల్లోకి పంపడం ద్వారా భార కుట్రకు పాల్పడ్డారని అన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని దుష్ట శక్తులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని ప్రయాణించే మార్గంలో బెలూన్లు ప్రత్యక్షం కావడాన్ని సెక్యూరిటీ లోపంగా పరిగణిస్తూ కేంద్రం సీరియస్ గా తీసుకొన్నట్లు సమాచారం. విజయవాడ సమీపంలోని ఓ కన్ట్రక్షన్ బిల్డింగ్ పై నుండి ఈ బెలూన్లు ఎగరేసినట్లు సమాచారం.