సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన ఆయన భార్య లతా

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆసుపత్రికి వెళ్లారనే వార్త అభిమానులను కలవరపెడుతూ ఉంది. గురువారం సాయంత్రం ఆయన చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరినట్టు తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్ బుధవారం రాత్రి ఆయన నటించిన ‘అన్నాత్తే’(తెలుగులో పెద్దన్న) సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు. ఇప్పటికే సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇంతలో ఆయన ఆరోగ్యం సరిగా లేదన్న వార్త అందరినీ టెన్షన్ పెడుతోంది. రజనీకాంత్ తీవ్రమైన తలనొప్పి, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ స్పందించారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రిలో చేరారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఏడాదికి ఒకసారి ఇలాంటి పరీక్షలు సర్వసాధారణమైన విషయమేనని తెలిపారు. రజనీకాంత్ కొన్ని గంటల్లోనే ఇంటికి చేరుకుంటారని భావించినా.. శుక్రవారం కూడా ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
సినిమా రంగానికి చేసిన కృషికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించడానికి న్యూ ఢిల్లీకి వెళ్లారు రజనీకాంత్. రాజధాని పర్యటన సందర్భంగా రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను కూడా కలిశారు. అంతకుముందు డిసెంబర్ 2020 లో బీపీ మరియు అలసట కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు రజనీకాంత్.