రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. రజనీకాంత్ ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. చెన్నై ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో నిన్న చేరారని, తల తిరుగుతుండడంతో ఆయన అసౌకర్యానికి గురయ్యారని ఆ బులెటిన్ లో వివరించారు. నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలించిందని, ఆయనకు కరోటిడ్ ఆర్టెరీ రీవాస్కులరైజేషన్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించామని.. నేటి ఉదయం ఆయనకు రీవాస్కులరైజేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని.. మరికొన్నిరోజుల్లో రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆ బులెటిన్ లో వెల్లడించారు.
రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ అంతకు ముందు స్పందించారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రిలో చేరారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఏడాదికి ఒకసారి ఇలాంటి పరీక్షలు సర్వసాధారణమైన విషయమేనని తెలిపారు. సినిమా రంగానికి చేసిన కృషికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించడానికి ఇటీవలే న్యూ ఢిల్లీకి వెళ్లారు రజనీకాంత్. రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను కూడా కలిశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆసుపత్రికి వెళ్లారనే వార్త అభిమానులను కలవరపెడుతూ ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్ బుధవారం రాత్రి ఆయన నటించిన ‘అన్నాత్తే’(తెలుగులో పెద్దన్న) సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు.
