More

    ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. కోలుకున్న రజనీ

    భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు. ఈనెల 13న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆ తర్వాత డెంగీ నిర్ధారణ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లోనే ఉండి చికిత్స పొందుతుతున్నారు. ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్​లోని ప్రైవేట్ వార్డులో మన్మోహన్ సింగ్‌కు చికిత్స అందించారు. ఆదివారం రాత్రి ఎయిమ్స్ వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మన్మోహన్ ఆస్పత్రి డిశ్చార్జ్ కావడంతో ఆయన కుటుంబంతో పాటు కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేంద్ర మంత్రులు, ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

    మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా కోలుకున్నారు. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌ డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సూచనల మేరకు ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. రజనీ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు. రజనీకి ఇటీవలే భారత ప్రభుత్వం దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. ఢిల్లీ నుండి చెన్నైకు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. రజనీకాంత్‌ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ గుర్తించామని, అందుకు సరైన చికిత్స చేశామని వైద్యులు ప్రకటించారు. రజనీకాంత్ కోలుకున్నారన్న వార్తతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

    Trending Stories

    Related Stories