National

బాల్య వివాహాలను చట్టబద్దం చేసేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తీవ్ర విమర్శలు

ఎంతో మంది గొప్ప మనుషులు చేసిన త్యాగాల కారణంగా బాల్య వివాహాలు దాదాపు అంతరించిపోయాయి. బాల్య వివాహాలను దేశంలో అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం చేసిన పని కారణంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బాల్య వివాహాలకు చట్టబద్ధతను కల్పించింది. పిల్లలకు చేసే పెళ్లిళ్లను నమోదు చేసేలా రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ (సవరణ) బిల్లు 2021ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే కాకుండా.. ఆ బిల్లును పాస్ చేశారు. మైనర్లకు పెళ్లి చేస్తే.. నెలలోపు ఆ వివరాలను అధికారులకు వారి తల్లిదండ్రులు తెలియజేయాల్సి ఉంటుంది. పెళ్లిని నమోదు చేయాలి.

బీజేపీ సహా ఆ రాష్ట్ర విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. బాల్యవివాహాలకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ బిల్లు పాసైన ఈ రోజు బ్లాక్ డే అంటూ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ లహోటీ మండిపడ్డారు. చట్టసవరణ చేయడం ద్వారా బాల్య వివాహాలను చట్టబద్ధంగా అనుమతిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్ మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. బాల్య వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నట్టు సవరణలో ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ సవరణ చేశామన్నారు. భర్త చనిపోయిన మహిళలకు ప్రభుత్వ ఫలాలు అందాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరని, అందుకే పెళ్లి నమోదను తప్పనిసరి చేశామని అంటున్నారు.

రాజస్థాన్ లోని కాంగ్రెస్ పార్టీ తీరును పలువురు సంఘ సంస్కర్తలు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతూ ఉన్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో ఆమోదించబడిన బిల్లు కారణంగా ఇప్పుడు ప్రభుత్వం అదనపు జిల్లా వివాహ నమోదు అధికారి (DMRO) ని నియమించాల్సి ఉంది. వివాహాల తప్పనిసరి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, వివాహ సమయంలో అమ్మాయి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు అబ్బాయి వయస్సు 21 కన్నా తక్కువ ఉంటే, ఆమె తల్లిదండ్రులు 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలి. 2009 చట్టంలోని సెక్షన్ 8 సవరణపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి, దీనిని తొలగించాలని చెప్పారు. వాయిస్ ఓటు ద్వారా బిల్లు ఆమోదించబడింది.

Related Articles

Back to top button