More

    రాజస్థాన్ లో చనిపోయిన 7 మంది పిల్లలు.. వింత వ్యాధా..?

    రాజస్థాన్ రాష్ట్రం, సిరోహి ప్రాంతంలోని ఫూలాబాయి ఖేడా గ్రామంలో 7 మంది పిల్లలు ‘వింత వ్యాధి’ కారణంగా మరణించడంతో రాజస్థాన్ ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. పిల్లలు సిరోహి ఆసుపత్రిలో సరైన చికిత్స అందకపోవడంతో మరణించారని అంటుండగా.. ఏదో తెలియని వైరస్ కారణంగా మరణించారనే ప్రచారం సాగుతోంది. మరణానికి అసలు కారణాన్ని తెలుసుకోవడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ జోధ్‌పూర్, జైపూర్‌ల నుండి వైద్య బృందాలను పంపింది.

    రాజస్థాన్ ఆరోగ్య మంత్రి పర్సాది లాల్ మీనా ఏప్రిల్ 15న కలెక్టర్‌తో మాట్లాడారని, గ్రామంలో అన్ని విషయాలపై సర్వే జరుగుతోందని చెప్పారు. “పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది. జైపూర్, జోధ్‌పూర్ నుండి బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి” అని తెలిపారు.

    గత 6 రోజుల్లో మరణించిన 7 మంది పిల్లలు ఫిట్స్, వాంతులు, జ్వరం అని ఫిర్యాదు చేశారు. వైద్యులు వ్యాధిని నిర్ధారించలేకపోయారు, ఇంతలోనే పిల్లలు మరణించారు. సిరోహి గ్రామ సర్పంచ్ 7 మరణాలను ధృవీకరించగా, జిల్లా అధికారుల ప్రకారం 5 మంది పిల్లలు గుర్తు తెలియని వ్యాధి కారణంగా మరణించారని తెలిపారు.

    గ్రామానికి పంపిన వైద్యబృందాలు మెదడువాపు వ్యాధి కారణంగా చిన్నారులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అసలు కారణం ఇంకా నిర్ధారించబడలేదు. ఇలాంటి లక్షణాలతో మరెంత మంది పిల్లలు బాధపడుతున్నారో తెలుసుకోవడానికి వైద్య బృందాలు, వైద్యులు సిరోహి, సమీప గ్రామాల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. మరణించిన 10-15 ఏళ్ల కేటగిరీకి చెందిన పిల్లలు సరైన వైద్యం అందక ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 13 వరకు మరణించారని చెబుతున్నారు.

    నవభారత్ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. ఇద్దరు పిల్లలు మరణించిన ఒక కుటుంబం గురించి.. పిల్లలు స్థానిక విక్రేతలు ‘పెప్సీ’గా విక్రయించే చౌకగా ప్యాక్ చేసిన ఐస్‌డ్ డ్రింక్‌ను తాగారని పేర్కొంది. మొదటి కేసుగా గుర్తించబడిన 5 ఏళ్ల బాలుడు మూర్ఛ గురించి ఫిర్యాదు చేశాడు. అతనికి కొద్దిగా జ్వరం ఉంది. వెంటనే ఏప్రిల్ 9 న ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతను మరణించాడు. ఏప్రిల్ 10 న ఇద్దరు పిల్లలు మరణించారు. ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 13 మధ్య నలుగురు మరణించారు. వైద్యులు పిల్లలు మరణించిన అదే ఇంటి నుండి పిల్లల నమూనాలను సేకరించారు. నమూనాలను పరీక్షల కోసం జైపూర్‌లోని SMS మెడికల్ కాలేజీ మరియు జోధ్‌పూర్‌లోని SN మెడికల్ కాలేజీకి పంపారు. ప్రస్తుతం సిరోహితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వైద్యబృందాల సర్వే కొనసాగుతుండగా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే పిల్లలకు వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం, ఆరోగ్యశాఖ 4కిలోమీటర్లకు ఒకరు చొప్పున చిన్నపిల్లల వైద్యులని నియమించింది.

    Trending Stories

    Related Stories