More

    ఎన్నిక ఏదైనా.. జెండా సిరిసిల్లదే..

    ఇప్పటి వరకు అగ్గిపెట్టేలో పట్టే చీరతో సిరిసిల్ల నేతన్నలు రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఎన్నిక ఏదైనా జెండా మాదే అంటున్నారు. మొన్నటి వరకు దేశమంతా త్రివర్ణ పతాకాన్ని అందించిన నేతన్న… ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికతో మళ్లీ బిజీ కానున్నారు. ఒక్క మునుగోడు మాత్రమే కాదు.. దేశం మొత్తం మీద పార్టీ ఏదైన సరే.. జెండా మాత్రం సిరిసిల్లదే అవుతుంది.

    నేత కార్మికులకు నిలయం సిరిసిల్ల. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో… ఈ ప్రాంతం నిత్యం ఆత్మహత్యలతో వార్తల్లో నిలిచేది. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, సుగంధ పరిమళాలు వెదజల్లే చీరలు, రాజన్న సిరిపట్టు చీరలను తయారు చేస్తూ… సిరిసిల్ల నేతన్నలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. చీరలే కాకుండా…ఎన్నికలొస్తే పార్టీ జెండాలను కూడా ప్రింట్ చేయడంలో నేతన్నలు అంతా బిజీ అయిపోతారు.


    ఎన్నికల టైమ్ వచ్చిందంటే చాలు… పార్టీలన్ని సిరిసిల్లవైపు చూస్తాయి. మొన్నటి వరకు జాతీయ జెండాలు తయారు చేయడంలో బిజీగా ఉన్న నేతన్నలు… ఇప్పుడు మునుగోడు ఉప సమరంతో మరోసారి బిజీ అయ్యారు. ఈ ప్రాంతంలో ఎటు చూసినా.. వివిధ పార్టీల జెండాలు, బ్యానర్లు, టోపిల తయారీనే కనిపిస్తోంది. సిరిసిల్లలో తయారవుతున్న ఎన్నికల ప్రచార సామాగ్రిపై… 3వేల మంది కార్మికులకు ఉపాధి పొందుతున్నారు.


    తమిళనాడు, కర్నాటక, కేరళ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు… గత కొన్నేళ్లుగా సిరిసిల్ల నుంచే ఎన్నికల ప్రచార సామాగ్రిని సరఫరా చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో ఇప్పటికే చాలామంది బీడీ కార్మీకులు బీడీలు చుట్టడం మానేసి… ఈ ఎన్నికల ప్రచార సామాగ్రి తయారీ కోసం పనిచేస్తున్నారు. బీడీలు చుట్టే దాని కన్నా… జెండాలు కట్టే పని సులువుగా ఉందని చెప్తున్నారు. అయితే వేతనం మాత్రం తక్కువేనని వాపోతున్నారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక పరోక్షంగా… సిరిసిల్ల నేతన్నలకు కూడా ఉపాధి కల్పిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఎటువంటి ఆర్డర్స్ అయినా తయారు చేసి ఇస్తామంటున్నారు నేతన్నలు.

    Trending Stories

    Related Stories